ఎంపీ టికెట్ రాలేద‌ని ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. చివ‌ర‌కు గుండెపోటుతో మృతి

ఎండీఎంకే నేత ఏ గ‌ణేశ‌మూర్తి(77) క‌న్నుమూశారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో త‌న‌కు టికెట్ కేటాయించ‌క‌పోవ‌డంతో, తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన గ‌ణేశ మూర్తి ఇటీవ‌లే పురుగుల మందు తాగారు. చికిత్స పొందుతూ గురువారం తెల్ల‌వారుజామున గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు.

  • Publish Date - March 28, 2024 / 04:43 AM IST

చెన్నై : త‌మిళ‌నాడులో విషాదం నెల‌కొంది. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే నేత ఏ గ‌ణేశ‌మూర్తి(77) క‌న్నుమూశారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో త‌న‌కు టికెట్ కేటాయించ‌క‌పోవ‌డంతో, తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన గ‌ణేశ మూర్తి ఇటీవ‌లే పురుగుల మందు తాగారు. తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన ఆయ‌న‌ను కోయంబ‌త్తూరులోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతూ గురువారం తెల్ల‌వారుజామున 5:05 గంట‌ల‌కు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు.

2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో డీఎంకే కూట‌మిలో భాగంగా ఎండీఎంకేకు ఈరోడ్ స్థానం ద‌క్కింది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌ణేశ‌మూర్తి డీఎంకే గుర్తుపైనే పోటీ చేసి గెలుపొందారు. అయితే ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో కూట‌మి స‌ర్దుబాట్ల‌లో భాగంగా ఎండీఎంకేకు తిరుచ్చి ఎంపీ స్థానం కేటాయించారు. అక్క‌డ్నుంచి దురైవైగోను పార్టీ త‌మ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించింది. దీంతో గ‌ణేశ‌మూర్తి తీవ్ర మ‌న‌స్తాపానికి గురై మార్చి 24న ఇంట్లోనే పురుగుల మందు సేవించారు.

గ‌ణేశ‌మూర్తి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డంతో.. చికిత్స నిమిత్తం కోయంబ‌త్తూరుకు త‌ర‌లించారు. చికిత్స పొందుతున్న ఆయ‌న గుండెపోటు గురై గురువారం ఉద‌యం ప్రాణాలు విడిచారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. గ‌ణేశ‌మూర్తి మృతి ప‌ట్ల డీఎండీకే నాయ‌కులు సంతాపం ప్ర‌క‌టించారు.

1947లో జ‌న్మించిన గ‌ణేశ‌మూర్తి.. 1993లో ఎండీఎంకే ఆవిర్భావం నుంచి అదే పార్టీలో కొన‌సాగుతున్నారు. 1998లో తొలిసారిగా ప‌ళ‌ని ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందారు. ఆ త‌ర్వాత అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచారు. 2009, 2019 ఎన్నిక‌ల్లో ఈరోడ్ నుంచి పార్ల‌మెంట్‌కు ఎన్నిక‌య్యారు. 

Latest News