Ravula Chandrasekhar Reddy | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయా పార్టీల్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఆయా పార్టీల్లో ఎమ్మెల్యే టికెట్లు దక్కనివారు, అసంతృప్తులు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. సైకిల్‌ను వీడి కారెక్కాలని చంద్రశేఖర్ రెడ్డిని బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కోరినట్లు సమాచారం. చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. రావుల పార్టీ మార్పులపై శుక్రవారం లోగా ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
టీడీపీ తరపున 1994, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నియోకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో ఏపీ ప్రభుత్వ విప్‌గా పని చేశారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడి టీడీపీ ముఖ్య నాయకులు వివిధ పార్టీల తీర్థం పుచ్చుకున్నారు. రావుల మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు. చంద్రబాబు ఆయనను పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కూడా నియమించారు. వనపర్తి జిల్లాలో రావుల చంద్రశేఖర్ రెడ్డికి మంచి పట్టుంది.