- ఆయన అలసిపోయిన ముఖ్యమంత్రి
- రాష్ట్రంలో పరిపాలన సాగిందే ఆర్జేడీ వల్ల
- నితీశ్ నిర్ణయంపై తేజస్వి తొలి స్పందన
- బీహార్‌లో ఆట ముగియలేదని వ్యాఖ్య
బీహార్‌లో ఆట ఇంకా మిగిలే ఉన్నదని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ అన్నారు. ‘నేను బీజేపీకి శుభాకాంక్షలు మాత్రమే చెప్పగలను. వారి కూటమిలో జేడీయూను కలుపుకొన్నందుకు బీజేపీకి ధన్యవాదాలు కూడా. వాళ్లను ఇవాళ ప్రమాణం చేయనీయండి. బీహార్‌లో ఆట ఇంకా అయిపోలేదు’ అని ఆయన పేర్కొన్నారు. నితీశ్‌కుమార్ అలిసిపోయారు. ప్రభుత్వం చేయాల్సిన పని మొత్తాన్ని ఆయనతో ఆర్జేడీ చేయించింది. ఆయనపై నేనేమీ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయను. కానీ.. నితీశ్‌కుమార్ ఏం మాట్లాడుతారో ఆయనకు కూడా తెలియదు. నేను చెప్పేది గుర్తుంచుకోండి. 2024 చివరికి జేడీయూ అదృశ్యం అవుతుంది. వాళ్లు ప్రజలకు ఏమైనా చేశారంటే అది మా వల్లే. జేడీయూను తీసుకున్నందుకు నేను బీజేపీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అని తేజస్వియాదవ్ అన్నారు. తనకు నితీశ్‌పై వ్యక్తిగతంగా కోపం ఏమీ లేదని చెప్పారు. ‘ఉద్యోగావకాశాలు కల్పించడం అసాధ్యమని నితీశ్ మాట్లాడేవారు. కానీ.. మేం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాతే అది వాస్తవరూపం దాల్చింది. 17 నెలల్లో వివిధ శాఖల్లో రికార్డుస్థాయి పనులు జరిగాయంటే అది ఆర్జేడీ వల్లే’ అని చెప్పారు.