హైదరాబాద్ : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్ద ఫజల్ అలీ అనే కానిస్టేబుల్ గత కొంతకాలం నుంచి గన్‌మెన్‌గా పని చేస్తున్నాడు. అయితే శ్రీనగర్ కాలనీలోని ఓ హోటల్‌లో ఫజల్ అలీ దిగాడు. అక్కడే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అయితే సూసైడ్ చేసుకునే కంటే ముందు అలీ తన కుమారుడితో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలాన్ని మంత్రి సబిత, వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్ పరిశీలించారు. ఫజల్ అలీ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆర్థిక ఇబ్బందులా..? కుటుంబ కలహాలా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.