Telangana 2025-26 Budget: తెలంగాణ రాష్ట్రం 2025 – 26 బడ్జెట్ ను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బుధవారం శాసన సభలో ప్రవేశపెట్టారు. 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం రూ. 3,04,965 కోట్లు..రెవెన్యూ వ్యయం రూ. 2,26,982, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా బడ్జెట్ లో ప్రతిపాదన చేశారు.
మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణం 200 బిలియన్ డాలర్లుగా ఉందని..రాబోయే పదేళ్ల కాలంలో దీనిని ఐదు రెట్లు అభివృద్ధి చేసి 1000 బిలియన్ డాలర్ (ట్రిలియన్ డాలర్) వ్యవస్థగా రూపాంతరం చెందే దిశగా మా కార్యాచరణ ఉంటుందని సభలో భట్టి ప్రకటించారు. తెలంగాణ రైజింగ్ 2050ప్రణాళికతో మా పాలనను ముందుకు నడిపిస్తున్నామన్నారు.
ఉన్నత లక్ష్యాలను నిర్ధేశించుకుంటూ సుసంపన్నత, సమగ్రత, స్థిరమైన అభివృద్ధితో కూడిన తెలంగాణ నిర్మిస్తామని, ప్రతి పౌరుడికి విద్య, ఆరోగ్యం, ఉపాధి, సామాజిక భద్రతను కల్పించే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లడమే మా లక్ష్యమని భట్టి తెలిపారు. బడ్జెట్ కేటాయింపులు కేవలం ఆర్థిక కేటాయింపులు మాత్రమే కాదని, సమాన అభివృద్ధికి, ఆర్థిక స్థిరత్వానికి, సామాజిక న్యాయానికి మార్గదర్శికలు అని చెప్పుకొచ్చారు.
అసమానతలు లేని వ్యవస్థ స్థాపన లక్ష్యంగా ఈ బడ్జెట్ ను రూపొందించామన్నారు. తన బడ్జెట్ ప్రతిపాదనల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, వివిధ ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలకు సంబంధించిన కేటాయింపులను భట్టి వెల్లడించారు. తెలంగాణ శాసనసభ, మండలిలలో బడ్జెట్ పై ప్రసంగం పూర్తయ్యక ఉభయసభలు ఎల్లుండికి వాయిదా పడ్డాయి.
కేటాయింపులు
₹ 40,234 కోట్లు – షెడ్యూల్డ్ కులాల సంక్షేమం
₹31,605 కోట్లు – పంచాయతీరాజ్ & గ్రామీణం
₹24,439 కోట్లు – వ్యవసాయం
₹23,373 కోట్లు – నీటిపారుదల
₹23,108 కోట్లు – విద్య
₹21,221 కోట్లు – ఇంధనం
₹17,677 కోట్లు – మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్
₹17,169 కోట్లు – షెడ్యూల్డ్ తెగల సంక్షేమం
₹12,393 కోట్లు – ఆరోగ్యం
₹11,405 కోట్లు – వెనుకబడిన తరగతుల సంక్షేమం
₹10,188కోట్లు – హోంశాఖ
₹5,907 కోట్లు – రోడ్లు & భవనాలు
₹5,734 కోట్లు – పౌర సరఫరాలు
₹3,591 కోట్లు – మైనార్టీ సంక్షేమం
₹3,527 కోట్లు – పరిశ్రమలు
₹2,862 కోట్లు – మహిళలు మరియు శిశు సంక్షేమం
₹1,674 కోట్లు – పశుసంవర్ధకం
₹1,023 కోట్లు – అడవులు & పర్యావరణం
₹900 కోట్లు – కార్మిక ఉపాధి కల్పన
₹900 కోట్లు – యువజన సేవలు
₹775 కోట్లు – పర్యాటకం
₹774 కోట్లు – సమాచార సాంకేతికత
₹465 కోట్లు – క్రీడలు
₹371 కోట్లు – చేనేత
₹ 190 కోట్ల -దేవాదాయ శాఖ.
6 గ్యారెంటీల అమలుకు రూ.56,084 కోట్లు
మహాలక్ష్మి పథకానికి – రూ.4,305 కోట్లు, గృహజ్యోతి పథకానికి – రూ.2,080 కోట్లు, సన్న బియ్యం బోనస్‌కు – రూ.1800 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి – రూ.1,143 కోట్లు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి – రూ.723 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు – రూ.600 కోట్లు.