Tirumala Teppotsavam | సాలకట్ల తెప్సోత్సవాలకు ముస్తాబైన తిరుమల.. ఉత్సవాల విశిష్టత తెలుసా..?

  • Publish Date - March 20, 2024 / 02:38 AM IST

Tirumala Teppotsavam | శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు తిరుమల క్షేత్రం ముస్తాబైంది. బుధవారం నుంచి ఈ నెల 24 వరకు తెప్పోత్సవాలు జరుగనుండగా.. నేత్రపర్వంగా వేడుకలను నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల్లో ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. తెప్పోత్సవాల్లో తొలిరోజు బుధవారం సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేయనునున్నారు. రెండోరోజు 21న రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి తెప్పలపై విహరిస్తారు. మూడోరోజు 22న శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు మూడుసార్లు పుష్కరిణిలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. శ్రీమలయప్పస్వామి నాలుగో రోజు 23న ఐదుసార్లు, చివరి రోజు మార్చి 24న ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. తెప్పోత్సవాల కారణంగా బుధ, గురువారాల్లో టీటీడీ సహస్రదీపాలంకార సేవ.. 22 నుంచి 24 వరకు ఆర్జితసేవలైన బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసింది.

పుష్కరిణిలో నీరాళి మండపాన్ని నిర్మించిన సాళువ నరసింహరాయలు..

తెప్పోత్సవం తిరుమలలోని వేంకటేశ్వర స్వామివారి పుష్కరణిలో ప్రతి ఏటా వైభవంగా ఐదు రోజుల పాటు జరుగుతాయి. తిరుమల శ్రీవారికి ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమికి ముందు తెప్పోత్సవాలు నిర్వహించే ఆనవాయితీ కొనసాగుతూ వస్తున్నది. వీటిని ఫాల్గుణ శుక్ల ఏకాదశి నుంచి ప్రారంభమై పౌర్ణమి నాడు ముగిసేలా ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. తెప్ప అంటే ఓడ. ఓడలో ఆశీనులైన శ్రీవారిని కోనేటిలో విహారింపజేయడాన్నే తెప్పోత్సవంగా పిలుస్తారు. తెప్పోత్సవాలను తమిళంలో తిరుపల్లి ఓడై తిరునాళ్‌ అని, తెలుగులో తెప్ప తిరునాళ్లుగా పిలుస్తారు. తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీనకాలం నుంచి జరుగుతున్నట్టు ఆధారాలున్నాయి. సాళువ నరసింహరాయలు సామాన్య శకం 1468లో పుష్కరిణి మధ్యలో ‘నీరాళి మండపాన్ని’ నిర్మించి.. తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు. తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను ఘనతను కీర్తించారు.

సర్వాలంకార భూషితుడై..

ఐదురోజుల పాటు జరిగే తెప్పోత్సవాల్లో తొలిరోజు సీతారాములతో పాటు లక్ష్మణుడికి సైతం పూజలు చేస్తారు. రెండోరోజు శ్రీకృష్ణుడు, రుక్మిణి దేవికి పూజలు చేస్తారు. మిగతా మూడు రోజుల్లో మలయప్ప స్వామితో పాటు శ్రీదేవి, భూదేవి పూజలందుకుంటారు. ఈ ఉత్సవ మూర్తుల్ని అద్భుతంగా అలంకరించి పుష్కరిణి పై ఉన్న ప్రత్యేక తెప్పలపై ఉంచి పూజలు చేస్తూ.. పుష్కరిణిలో విహరింపజేస్తారు. ముందుగా ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు వేంపు చేస్తారు. అనంతరం అందంగా అలంకరించిన తెప్పపై స్వామివారు ఆశీనులై పుష్కరిణిలో విహరింపజేస్తారు. మూడో రోజు సర్వాలంకార భూషితుడై పురవీధుల్లో ఊరేగిన అనంతరం.. కోనేటిలో తెప్పపై కొలువుదీరి.. మూడుసార్లు విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. నాలుగో రోజు ఐదుసార్లు, చివరి రోజు ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.

Latest News