Site icon vidhaatha

పంజాబ్‌లో రైతుల రైల్‌రోకో

చండీగఢ్‌ : చెరుకు ధరలు పెంచాలని, పలు కేసులలో విధించిన జరిమానాలను మాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తూ పంజాబ్‌ రైతులు రోడ్డెక్కారు. జలంధర్‌లోని ధన్నోవాలి సమీపంలో రైల్వే ట్రాక్ పై రైతులు బైఠాయించారు. రైతుల ఆందోళనతో ఈ మార్గంలో పలు రైళ్లు నిలిచిపోయాయి. ఈ ట్రాక్ పై రోజుకు 120 రైళ్లు ప్రయాణిస్తున్నాయని రైల్వే శాఖ తెలిపింది. గురువారం రైతులు సమ్మెకు దిగక ముందే ఈ ట్రాక్ పై 40 వాహనాలు వెళ్లాయి. రైతులు ట్రాక్ ఎక్కిన తర్వాత దాదాపు 80 రైళ్ళను దారి మళ్లించాల్సి వచ్చింది.


పీఏపీ చౌక్ నుండి లూధియానా వైపు కొద్ది దూరంలో ఉన్న ధన్నోవాలీ గేటు సమీపంలోని జలంధర్ లోని రైల్వే ట్రాక్‌ వద్ద జాతీయ రహదారిని రైతులు బుధవారమే దిగ్బంధించారు. ప్రస్తుతం రైతులు తమ డిమాండ్లతో హైవేపై టెంట్లు వేసుకుని కూర్చున్నారు. తాజాగా రైలు పట్టాలపై ఆందోళనకు దిగారు. నవంబరు 26న చండీగఢ్ కు వెళతామని రైతులు తెలిపారు. కాగా జాతీయ రహదారిని దిగ్బంధించి ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని పంజాబ్ సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌ రైతులకు విజ్ఞప్తి చేశారు. రైల్వే ట్రాక్ పై రైతులు బైఠాయించడంతో శతాబ్ది ఎక్స్ ప్రెస్ ను ఫగ్వారాలో, ఆమ్రపాలి ఎక్స్ ప్రెస్‌ను జలంధర్‌లో నిలిపివేశారు.


ఢిల్లీ, పానిపట్, అంబాల, లూథియానా వైపు వెళ్లే ఇతర రైళ్ళను నకోదర్ నుంచి పగ్వారా మార్గంలో మళ్ళించారు. ఈ ఉద్యమం కారణంగా న్యూఢిల్లీ నుంచి పంజాబ్‌కు వెళ్లే 56 రైళ్ల రాకపోకలు దెబ్బతిన్నాయని రైల్వే అధికారులు తెలిపారు. వీటిలో ఆరు రైళ్లను రద్దు చేయాల్సి ఉండగా 31 రైళ్లను దారి మళ్లించారు. 18 రైళ్లను ముందు స్టేషన్‌లోనే నిలిపివేశారు. రైలు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీరికోసం రైల్వేఅధికారులు ఆహార పదార్థాలు ఏర్పాటు చేశారు. రైళ్ల రద్దు సందర్భంలో ప్రజలు డబ్బువాపస్ తీసుకోవడానికి రీఫండ్ కౌంటర్లను కూడా రైల్వే ఏర్పాటు చేసింది.

Exit mobile version