ఒక్క జంప్‌తో వాగును దాటిన రాయల్‌ బెంగాల్‌ టైగర్‌.. వీడియో వైరల్‌

  • Publish Date - March 25, 2024 / 12:06 PM IST

ప్రకృతిలో అనేక దృశ్యాలు రమణీయంగా ఉంటాయి. అటవీ మృగాలు తమ ఆవాసాల్లో చేసే పనులు ఒక్కోసారి అబ్బురపరుస్తుంటాయి. అటువంటిదే ఈ వీడియో కూడా. జీవితకాలంలో మరోసారి చూడలేం అనిపించేలా ఉన్న ఈ వీడియో తెగ వైరల్‌ అవుతున్నది. పులి శక్తిని ఈ వీడియో చాటుతున్నది. అడవిలో పారుతున్న వాగును పెద్ద పులి ఒక్క ఉదుటన జంప్‌ చేసి దాటుతున్న దృశ్యాన్ని రైల్వేస్‌ అధికారి వీడియో తీసి ఇంటర్‌నెట్‌లో ఉంచారు. ఇది అనేక మంది ప్రశంసలు అందుకుంటున్నది. దీనిని ఐఆర్‌ఏఎస్‌ అధికారి అనంత్‌ రూపనగుడి చిత్రీకరించారు. ఒక పులి వాగు వద్దకు వస్తుంది. సాధారణంగా ఈదుకుంటూ వాగుదాటుతాయి. కానీ.. ఈ పులి మాత్రం ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు అవలీలగా జంప్‌ చేసేసింది. ఇది జీవితంలో ఒకసారి మాత్రమే కనిపించే దృశ్యమని రూపనగుడి దానికి క్యాప్షన్‌ జోడించారు. పులి వాగును జంప్‌ చేసి దాటడం ఒక ఎత్తయితే.. అటువంటి అరుదైన దృశ్యాన్ని రూపనగుడి చిత్రీకరించడం మరో విశేషం.

పెద్దపులులు వాటి శక్తికి, పరాక్రమం, లాఘవానికి పెట్టింది. ఈ వీడియో వాటన్నింటినీ గుర్తు చేస్తుంది. సుందర్బన్‌ అడవుల్లో ఈ వీడియోను చిత్రీకరించారు. అడవుల రక్షణ, అద్భుతమైన జంతుజాల ఆవాసాల పరిరక్షణ అవసరాన్ని కూడా ఈ వీడియో చాటుతున్నది.


ఇండియా, బంగ్లాదేశ్‌లలో సుందర్బన్‌ అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. అటవీ సౌందర్యానికి ప్రతీకగా ఈ అడవులు నిలుస్తున్నాయి. అంతేకాదు.. రాయల్‌ బెంగాల్‌ టైగర్లకు ఇది ప్రఖ్యాత ఆవాసం. 

Latest News