Site icon vidhaatha

Raja Shyamala Yagam | పురాణాల్లో రాజ‌సూయ యాగం.. రాజ‌కీయాల్లో రాజ‌శ్యామ‌ల యాగం..వ్య‌త్యాసం ఏంటి..?

Raja Shyamala Yagam | మన దేశంలో పురాణకాలం నుంచి వివిధ రకాలైన యాగాలు జరిగాయి. యజ్ఞం లేదా యాగం అంతిమ లక్ష్యం దేవతలకు తృప్తి కలిగించడమే. వారిని మెప్పించడమే. సాధారణంగా యజ్ఞం అనేది అగ్నిహోత్రం ద్వారా వేదమంత్రాల సహితంగా జరుగుతుంది. ఇందుకు అనుబంధంగా అనేక నియమాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం. యజ్ఞంలోని అగ్నిలో వేసినవి దేవతలందరికి చేరుతాయని విశ్వాసం. దేవతలు సంతృప్తి చెందితే యాగం చేసిన వారి కోరికలు నెరవేరతాయని అంటారు . యుద్ధాల్లో విజయం సిద్ధిస్తుందని చెబుతారు. పురాణాల్లో చేసిన రాజసూయ యాగం, ఇటీవ‌ల కాలంలో రాజకీయ నాయకులు నిర్వహిస్తున్న‌ రాజ శ్యామల యాగం రెండూ ఒకటేనా… రెండిటికీ మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసుకుందాం..

రాజసూయ యాగం అంటే..?

‘సూయం’ అంటే శాశ్వతం అని అర్థం. రాజ్యాన్ని, రాజుని శాశ్వతంగా ఉండేలా చేసేందుకు నిర్వ‌హించే యాగాన్ని రాజసూయ యాగం అంటారు. తమ సార్వభౌమాత్వాన్ని ప్రకటించుకునేందుకు రాజు నుంచి చక్రవర్తిగా మారే క్రమంలో చేసే యాగం ఇది. రాజసూయ యూగం రాజ్యం నిలబడడానికి, నా విజయానికి ఎదురులేదని చెప్పడానికి, శత్రువు తన ఎదురు నిలిచేందుకు కూడా సహాసించలేడని చెప్పేందుకు ప్రతీక. ఈ యాగాన్ని ఏడాది కాలం చేయొచ్చు, మండలం రోజులు అంటే 41 రోజులు చేయొచ్చు.. ఇంకా 21 రోజులు, 16 రోజులు, 3 రోజులు చేస్తారు. యాగం ముగిసిన తర్వాత పూర్ణాహుతి సమర్పించే సమయానికి అక్కడున్న సభలో ఎవరు గొప్పవారైతే వారికి ధారపోస్తారు. ధర్మరాజుతో కృష్ణుడు చేయించిన యాగం ఇది. రాజసూయ యాగం.. ధర్మరాజుతో శ్రీకృష్ణుడు చేయిస్తాడు. మహాభారతంలో సభాపర్వంలోనే ఉంటుంది ఈ యాగం ప్రస్తావన. శత్రు క్షయాన్నీ, కీర్తినీ, విజయాన్నీ సిద్ధింప చేస్తుంది కాబట్టి తప్పక ఈ యాగాన్ని చేయాలని శ్రీ కృష్ణుడు సూచించాడు. మయసభలో దుర్యోధనుడి పరాభవం – మహాభారత యుద్ధానికి మూలం కూడా ఇక్కడే జరిగింది. యాగం పూర్త‌యిన‌ తర్వాత శిశుపాలుడి వధ జరిగిందీ ఇక్కడే అంటే యాగం పూర్త‌యిన వెంటనే శత్రు సంహారం జరిగిందంటారు.

రాజ శ్యామల యాగం అంటే..?

రాజ్యలక్ష్మి వరించాలని..విజేతగా నిలిచేలా చేయాలని చేసేదే రాజశ్యామలయాగం. ఈ యాగం చేస్తే శత్రువు బలం తగ్గుతుంది, రాజకీయాల్లో విజయ లక్ష్మి వరిస్తుందని విశ్వసిస్తారు. మహాభారతంలో ధర్మరాజు తో శ్రీ కృష్ణుడు చేయించిన రాజసూయ యాగం, ప్రస్తుతం కేసీఆర్ చేస్తున్న రాజ శ్యామల యాగం ఒకటేనా అంటే.. ఈ రెండు యాగాలు ఒకటే కాకపోయినా వాటి వెనకున్న ఆంతర్యం, పరమార్థం మాత్రం ఒకటే అని పండితులు చెబుతున్నారు. ప్రారంభించిన కార్యంలో విజయం అందుకోవాలి, శత్రువులు క్షీణించాలి, సార్వ భౌమాధికారం సిద్ధించాలి, రాజ్యలక్ష్మి శాశ్వతంగా ఉండాలని చేస్తారు. రాజసూయ యాగం చేయడం చాలా పెద్ద క్రతువు అది నిర్వహించడం అంత సాధ్యం కాదు అందుకే అందుకు ప్రతిగా రాజశ్యామల యాగం ద్వారా విజయం సిద్ధించేలా చేయేమని శ్యామలా దేవిని ప్రశన్నం చేసుకుంటారు. రాజశ్యామ‌ల యాగం చేసిన ప్ర‌తీసారి కేసీఆర్ విజ‌యం అందుకున్నారు.

Exit mobile version