Husband | నా భార్య రక్తం కారేలా కొడుతోంది.. కళ్లల్లో యాసిడ్ పోసే ప్రయత్నం చేస్తోంది.. తనను కాపాడండి అంటూ ఓ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. మీరఠ్ నగర్ మేవ్‌గఢీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నదీం అనే వ్యక్తికి కొన్నేండ్ల క్రితం షబ్నం అనే మహిళతో వివాహమైంది. అయితే భార్య అతన్ని వేధింపులకు గురి చేస్తోంది. అయితే బుధవారం అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న నదీంపై షబ్నం కర్రతో దాడి చేసింది. రక్తం కారేలా కొట్టింది. కళ్లు తెరిచేందుకు ప్రయత్నించగా, యాసిడ్ పోసేందుకు యత్నించింది. దీంతో భయంతో పరుగులు తీయగా, కర్రతో వెంటపడినట్లు నదీం పేర్కొన్నాడు. ఆమెకు తనపై ఏ మాత్రం దయలేదని, మరొకరి ముందు కూడా కూర్చోనివ్వదని నదీం ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు షబ్నంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ ఇంచార్జి జితేంద్ర కుమార్ మాట్లాడుతూ.. సమగ్ర విచారణ జరిపాక కేసు నమోదు చేస్తామని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.