Site icon vidhaatha

మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమలుపై నిర్మల క్లారిటీ

మంగళూరు: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేసషన్‌ కల్పించే బిల్లును 2024 జనాభా లెక్కల తర్వాత అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ చెప్పారు. దక్షిణ కన్నడ జిల్లా జిల్లా మూద్‌బిద్రిలో రాణి అబ్బక్క పేరిట స్మారక తపాలా బిళ్లను ఒక కార్యక్రమంలో ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి మాట్లాడుతూ జాతి నిర్మాణలో మహిళల పాత్రపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి ఉన్న విశ్వాసం వల్లే మహిళా బిల్లు వాస్తవరూపం దాల్చిందని అన్నారు.


పోర్చుగీసు దురాక్రమణదారులపై పోరాటంలో 16వ శతాబ్దానికి చెందిన ఉల్లాల్‌ రాణి అబ్బక్క సాహసాన్ని, వీరత్వాన్ని ఆమె శ్లాఘించారు. సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడిన గుర్తుతెలియని వీరుల త్యాగాలను రికార్డుల్లోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా స్వాతంత్ర్యోద్యమలో ఘనమైన పాత్ర పోషించిన ప్రాంతాలకు సంబంధించిన 14,500 కథనాలను డిజిటైజ్‌ చేశామని చెప్పారు.


స్వాతంత్ర్యోద్యమంలో మహిళల పాత్ర, చట్టసభల్లో మహిళలు, స్వాతంత్ర్యోద్యమంలో గిరిజన నేతల గురించి మూడు పుస్తకాలు తెచ్చేందుకు అమర చిత్ర కథతో కేంద్ర సాంస్కృతిక శాఖ ఒప్పందం కుదుర్చుకున్నదని తెలిపారు. కోస్తా కర్ణాటకలో రాణి అబ్బక్క పేరిట సైనిక్‌ స్కూలు ఏర్పడుతుందనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. స్టాంపుపై ముద్రించిన రాణి అబ్బక్క చిత్రాన్ని గీసిన చిత్రకారుడు వాసుదేవ్‌ కామత్‌ను నిర్మాలాసీతారామన్‌ అభినందించారు.

Exit mobile version