Site icon vidhaatha

Wrestlers Protest | రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌పై ఎట్టకేలకు పోక్సో చట్టం కింద కేసు నమోదు..! జైలుకు పంపేదాక నిరసన కొనసాగుతుందన్న రెజ్లర్లు

Wrestlers Protest |

రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై ఎట్టలకేలకు ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారు. కన్నాట్‌ ప్లేస్‌ పోలీస్‌స్టేషన్‌లో రెండు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఇందులో ఒకటి మైనర్‌ రెజ్లర్‌ను లైంగిక వేధించినందుకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయగా.. అదే సమయంలో మరో ఆరుగురు మహిళా రెజ్లర్ల ఆరోపణలపై రెండో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని డీసీపీ ప్రణవ్‌ తాయల్‌ ధ్రువీకరించారు. సుప్రీంకోర్టు శుక్రవారం రెజ్లర్ల పిటిషన్‌పై విచారణ జరిపింది. ఈ సందర్భంగా బ్రిజ్‌ భూషణ్‌పై కేసు నమోదు చేసేందుకు పోలీసులు అంగీకరించారు.

మైనర్‌తో సహా ఏడుగురు మహిళా రెజ్లర్లు బ్రిజ్‌ భూషణ్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మరో వైపు రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌పై చర్యలు తీసుకోవాలని ఈ నెల 23 నుంచి బజరంగ్‌ పునియా, వినేష్‌ ఫోగట్‌, సాక్షి మాలిక సహా సీనియర్‌ రెజ్లర్లు జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన తెలుపుతున్నారు.

ఈ సందర్భంగా వినేష్‌ ఫోగట్‌ మాట్లాడుతూ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ను పదవుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. తనకు సుప్రీంకోర్టుపై పూర్తి విశ్వాసం ఉందని, ఇప్పటి వరకు జరిగిన విచారణపై సంతృప్తిగా ఉన్నానని పేర్కొన్నారు. క్రీడల్లో దేశ భవిష్యత్‌ను కాపాడుకోవాలంటే అందరు కలిసిరావాలని పిలుపునిచ్చింది.

రెజ్లింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఆయన కొనసాగితే పదవిని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని, తక్షణంపై చర్యలు తీసుకోవాలని, వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాలని బజరంగ్‌ పునియా డిమాండ్‌ చేశారు. తమ పోరాటం కేవలం ఎఫ్‌ఐఆర్‌ కోసమే మాత్రం కాదని.. ఇలాంటి వారి నుంచి క్రీడలను కాపాడాలన్నారు. అదే సమయంలో ఏ కమిటీకి సమాధానం చెప్పబోమని రెజ్లర్లు స్పష్టం చేశారు.

బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ జైలుకు వెళ్లే వరకు సమ్మె కొనసాగుతుందని క్రీడాకారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ ఎఫ్‌ఐఆర్‌పై స్పందిస్తూ విచారణ సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున తాను ఏమీ స్పందించలేదని, కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తున్నానన్నారు. పోలీసుల దర్యాప్తుపై నమ్మకం ఉందని, విచారణకు సహకరిస్తానన్నారు.

Exit mobile version