Site icon vidhaatha

You tube | ఊహించని షాక్‌ ఇచ్చిన యూట్యూబ్‌.. భారత్‌లో 22.5లక్షల వీడియోలు తొలగింపు..

You tube | కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘనలపై ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ కొరడా ఝుళిపించింది. అక్టోబర్‌-డిసెంబర్‌ 2023 త్రైమాసికంలో భారత్‌లో 22.5లక్షలకుపైగా వీడియోలను యూట్యూబ్‌ నుంచి తొలగించింది. ఇక ఈ జాబితాలో 12.4లక్షల వీడియోలతో సింగపూర్‌ రెండోస్థానం, 7.88లక్షలతో అమెరికా మూడోస్థానం, 7.70లక్షల వీడియోల తొలగింపుతో ఇండోనేషియా నాల్గో స్థానంలో నిలిచింది. 5.16లక్షల వీడియోలతో రష్యా ఐదోస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రోజుకు లక్షల్లో వీడియోలు అప్‌లోడ్‌ అవుతుంటాయి. అయితే, త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిటీ నిబంధనలు ఉల్లంఘించినందుకు 90లక్షలకుపైగానే వీడియోలను తొలగించింది. హానికాకరమైన, ప్రమాదకరమైన, పిల్లల భద్రత, హింసాత్మక, గ్రాఫిక్‌, అశ్లీలం, తప్పుడు ప్రచారం తదితర పారామీటర్లపై కమ్యూనిటీ నిబంధనలను ఉల్లంఘించినందుకు వీడియోలను తొలగించింది.

అయితే, అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో భారత్‌లో 22.5లక్షల వీడియోలను తొలగించినట్లు నివేదిక పేర్కొంది. వీడియోల తొలగింపు జాబితాలో భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా మార్గదర్శకాలు ఉల్లంఘించిన 2,05,92,341 ఛానెల్స్‌ను తొలగించింది. ఛానెల్‌ను తొలగించిన సమయంలో.. అందులోని వీడియోలను సైతం తొలగిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఛానెల్‌ రద్దు కారణంగా తొలగించిన వీడియోల సంఖ్య 9,55,34,236గా ఉన్నది. యూట్యూబ్ ఛానెల్ 90 రోజుల్లో మూడు కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే.. ఛానెల్ రద్దవుతుందని యూట్యూబ్‌ స్పష్టం చేసింది. ప్లాట్‌ఫామ్‌పై సురక్షితమైన, శక్తివంతమైన కమ్యూనిటీని నిర్వహించేందుకు తీవ్రంగా పని చేస్తున్నట్లుగా గూగుల్‌ యాజమాన్యంలోని కంపెనీ వివరించింది.

Exit mobile version