Site icon vidhaatha

గ్రీన్‌ క్రెడిట్‌ రూల్స్‌ ఉపసంహరించండి

లాభార్జనే ధ్యేయంగా గ్రీన్‌ క్రెడిట్‌ రూల్స్‌
అటవీ వైవిధ్యం దెబ్బతింటుంది
అటవీ ప్రాంతం మరింత మాయం
కేంద్రానికి వందమంది ప్రముఖుల లేఖ

న్యూఢిల్లీ : గత ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన నోటిఫై చేసిన గ్రీన్‌క్రెడిట్‌ రూల్స్‌, దాని మెథడాలజీపై వందకుపై పర్యావరణ వేత్తలు, మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు, లాయర్లు, ప్రముఖులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖకు లేఖ రాశారు. అటవీ వైవిధ్య కార్యకలాపాల ద్వారా గ్రీన్‌ క్రెడిట్‌ పాయింట్లు పొందేందుకు నోటిఫై చేసిన పద్ధతి పర్యావరణానికి, ఆటవీప్రాంతాలకు, వాతావరణానికి, ఆదివాసీ హక్కులకు తీవ్ర భంగం కల్గిస్తుందని ఆ లేఖలో పేర్కొన్నారు.

మార్కెట్‌ ఆవిష్కరణ పథకంగా దీనిని చెబుతున్నా.. అటవీ ప్రాంతాల్లో వ్యాపార కార్యకలాపాలను మరింత వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు. అంతిమంగా పర్యావరణ హక్కులు ఉల్లంఘనకు గురవుతాయని తెలిపారు. ఈ పద్ధతి నిలకడలేని మార్గమని పేర్కొన్నారు. దీనితో స్వాభావికమైన నేలలు తీవ్రంగా నాశనమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2024 ఫిబ్రవరిలో జారీ చేసిన తాజా నోటిఫికేషన్‌ తమ అనుమానాలు, ఆందోళనలను ధృవీకరించాయని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు వీలుగా చట్టపరమైన వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన ప్రస్తుత తరుణంలో ప్రకృతి వనరులను మరింతగా దోచుకునేందుకు గ్రీన్‌క్రెడిట్‌ పాయింట్స్‌ పథకం మరో సాధనంగా ఉపయోగపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

దీనిపై కేంద్ర పర్యావరణ శాఖ తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. తాజాగా విడుదల చేసిన పూర్తిగా అశాస్త్రీయమైన నోటిఫికేషన్‌ను అమలు చేసే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని కోరారు. నిపుణులు, బాధిత ప్రజలతో సంప్రదించకుండా ఎలాంటి కార్యక్రమాన్ని చేపట్టరాదని డిమాండ్‌ చేశారు. 2023 గ్రీన్‌ క్రెడిట్‌ రూల్స్‌ను తక్షణ ఉపసంహరించాలని కోరారు. ఈ లేఖపై సంతకాలు చేసినవారిలో పీపుల్స్‌ యూనియన్‌ ఆఫ్‌ సివిల్‌ లిబర్టీస్‌, లెట్‌ ఇండియా బ్రీత్‌, సెంటర్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ అక్కౌంటబిలిటీ, ధాత్రి ట్రస్ట్‌ తదితర సంస్థల ప్రతినిధులు, తీస్తా సెతల్వాద్‌, అమృత భట్టాచార్జీ తదితర ప్రముఖులు ఉన్నారు.

Exit mobile version