Debit Cards | మీ దగ్గర డెబిట్‌ కార్డు ఉంటే.. మీపై లక్షల్లో బీమా కవరేజ్‌ ఉన్నట్టే

Debit Cards | ప్రస్తుతం బ్యాంక్ ఖాతా లేనివాళ్లు ఉండరు. ప్రభుత్వ పథకాలు మొదలు అన్నింటికీ బ్యాంకు ఖాతా అనివార్యంగా మారింది. దాంతో సహజంగానే అందరికి బ్యాంకు ఖాతాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ బ్యాంకు ఖాతాల్లో నుంచి మనం డబ్బులు తీసుకోవడానికి ఇచ్చే ఏటీఎం కార్డులపై బీమా సదుపాయం ఉంటుంది. కార్డును బట్టి ఏకంగా రూ.10 లక్షల వరకు కూడా బీమా అందిస్తారు.

  • Publish Date - June 29, 2024 / 10:40 AM IST

Debit Cards : ప్రస్తుతం బ్యాంక్ ఖాతా లేనివాళ్లు ఉండరు. ప్రభుత్వ పథకాలు మొదలు అన్నింటికీ బ్యాంకు ఖాతా అనివార్యంగా మారింది. దాంతో సహజంగానే అందరికి బ్యాంకు ఖాతాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ బ్యాంకు ఖాతాల్లో నుంచి మనం డబ్బులు తీసుకోవడానికి ఇచ్చే ఏటీఎం కార్డులపై బీమా సదుపాయం ఉంటుంది. కార్డును బట్టి ఏకంగా రూ.10 లక్షల వరకు కూడా బీమా అందిస్తారు. ఇంతకీ ఏ కార్డులపై ఎంత బీమా వర్తిస్తుంది..? వీటిని ఎలా క్లైమ్‌ చేసుకుంటారు..? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఎస్‌బీఐ గోల్డ్‌ మాస్టర్‌ కార్డ్‌ లేదా వీసా కార్డ్ కలిగి ఉన్న వారికి రూ.4 లక్షల ఎయిర్‌ డెత్‌ (విమాన ప్రమాదాల్లో మరణిస్తే), రూ.2 లక్షల నాన్‌ ఎయిర్‌ డెత్‌ ఇన్సూరెన్స్‌ కవర్‌ అవుతుంది. ఇక ప్రీమియం కార్డ్‌ హోల్డర్స్‌కు రూ.10 లక్షల ఎయిర్‌ డెత్‌, రూ.5 లక్షల నాన్‌ ఎయిర్‌ డెత్‌ కవర్‌ లభిస్తుంది. కాగా సాధారణ మాస్టర్‌కార్డ్‌పై రూ.50 వేలు, ప్లాటినం మాస్టర్‌కార్డ్‌పై రూ.5 లక్షలు, సాధారణ వీసా కార్డుపై రూ.2 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పిస్తారు.

అదేవిధంగా ప్రధానమంత్రి జనధన్ యోజన కింద ఖాతా తెరిచిన వారికి రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఇన్సూరెన్స్‌ లభిస్తుంది. అయితే ప్రమాదం జరిగిన తేదీకి ముందు 90 రోజుల వ్యవధిలో ఏటీఎమ్‌ కార్డుతో ఏదైనా లావాదేవీ చేసి ఉంటేనే బీమా క్లెయిమ్ చేసుకోవడానికి అర్హులు. క్లెయిమ్ చేయడానికి ఆస్పత్రి బిల్లు, చెల్లుబాటు అయ్యే డెత్‌ సర్టిఫికెట్, పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ కావాల్సి ఉంటుంది. ఏటీఎమ్‌ ఉన్న వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే నామినీ డెత్ సర్టిఫికెట్‌ను అందించాల్సి ఉంటుంది.

క్లెయిమ్‌ను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ విధానాల్లో అప్లై చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ విధానంలో అప్లై చేసుకునే వారు బ్యాంకుకు వెళ్లి ఫామ్‌ను ఫిల్‌ చేయాల్సి ఉంటుంది. క్లెయిమ్‌ చేయగానే బ్యాంకు ఒక అధికారిని నియమిస్తుంది. అనంతరం అధికారులు దర్యాప్తు చేస్తారు. వెరిఫికేషన్‌ తర్వాత తుది నివేదికను సిద్ధం చేస్తారు. ఆ తర్వాత క్లెయిమ్ మొత్తం 10 రోజుల వ్యవధిలో అందిస్తారు. ప్రమాదం జరిగిన 60 రోజుల్లోపు క్లెయిమ్‌ చేసుకుంటే బీమా మొత్తం పొందొచ్చు. లేదంటే క్లెయిమ్‌ను తిరస్కరించే అవకాశాలు ఉన్నాయి.

Latest News