Site icon vidhaatha

Central Bank | సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ఆర్‌బీఐ షాక్‌..! నిబంధనలు పాటించనందుకు రూ.1.45కోట్ల ఫైన్‌..!

Central Bank | ఇటీవల  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దూకుడు పెంచింది. ఆదేశాలు ఉల్లంఘించిన, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న బ్యాంకులపై కొరడా ఝుళిపిస్తున్నది. ఆంక్షలు విధించడంతో పాటు భారీగానే జరిమానాలు విధిస్తూ వస్తున్నది. తాజాగా ప్రముఖ బ్యాంక్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు సైతం షాక్‌ ఇచ్చింది. బ్యాంకుకు రూ.1.45కోట్ల జరిమానా విధించింది. అప్పులు, అడ్వాన్సులు సహా కస్టమర్ ప్రొటెక్షన్‌కు సంబంధించిన నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకు బ్యాంకుకు ఈ జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్నది.

ప్రభుత్వం నుంచి సబ్సిడీగా పొందిన మొత్తానికి బదులుగా బ్యాంక్ ఓ కంపెనీకి వర్కింగ్ క్యాపిటల్ డిమాండ్ లోన్‌ను మంజూరు చేసింది. అలాగే, కొన్ని అనధికారిక లావాదేవీల్లో బ్యాంకు ఖాతాదారుల అకౌంట్లలోకి చేరిన మొత్తాన్ని నిర్ణీత గడువులోగా జమచేయలేకపోయినట్లుగా ఆర్‌బీఐ గుర్తించింది. ఆర్‌బీఐ నిర్వహించిన తనిఖీల్లో సైతం సెంట్రల్‌ బ్యాంకు తప్పిదాలు నిజమేనని తేలింది. ఈ క్రమంలో తన ఆదేశాలు, సూచనలు పాటించడంలో విఫలమైనందుకు జరిమానా విధించకూడదోనని రిజర్వ్‌ బ్యాంక్‌ నోటీసులు ఇచ్చింది.

అయితే, బ్యాంకు ఇచ్చిన సమాధానం అంత సంతృప్తికరంగా లేకపోవడంతో రూ.1.45కోట్ల జరిమానా విధించింది. అలాగే 2016 కేవైసీ ఆదేశాలు సహా ఇతర నిబంధనలు పాటించడం లేదంటూ సోనాలి బ్యాంక్‌పై సైతం చర్యలు చేపట్టింది. ఆ బ్యాంకుకు రూ.96.4 లక్షల జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. అదే సమయంలో యాక్సిస్ బ్యాంకుపైనా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ రూ.1.66 కోట్లకుపైగా జరిమానా విధించింది.

Exit mobile version