Diamonds | ఇక నిమిషాల్లోనే కృత్రిమ వజ్రాల తయారీ..! కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు

Diamonds | వజ్రాలు ఇష్టపడని వారెవరుంటారు. ఇది సరేకానీ వాటి ధరలు మాత్రం అందనంత ఎత్తులో ఉంటాయి. భూమిపై అరుదుగా వజ్రాలు లభ్యమవడమే ఈ ధర భారీగా ఉండడానికి ప్రధాన కారణం. ప్రస్తుతం కృత్రిమంగా వజ్రాలను తయారు చేసే పద్ధతిని శాస్త్రవేత్తలు గుర్తించారు.

  • Publish Date - April 27, 2024 / 07:53 AM IST

Diamonds | వజ్రాలు ఇష్టపడని వారెవరుంటారు.  కానీ, వాటి ధరలు మాత్రం అందనంత ఎత్తులో ఉంటాయి. భూమిపై అరుదుగా వజ్రాలు లభ్యమవడమే ఈ ధర భారీగా ఉండడానికి ప్రధాన కారణం. ప్రస్తుతం కృత్రిమంగా వజ్రాలను తయారు చేసే పద్ధతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పద్ధతిలో భారీ ఖర్చులతో పాటు సమయం సైతం ఎక్కువకాలం పడుతున్నది. తాజాగా కేవలం నిమిషాల వ్యవధిలోనే.. అది తక్కువ ఖర్చుతోనే కృత్రిమంగా వజ్రాలను తయారు చేసే టెక్నాలజీని శాస్త్రవేత్తలు డెవలప్‌ చేశారు. కార్బన్‌ మూలకంలోని పరమాణువులను ఓ క్రమ పద్ధతిలో అమరి ఉండి వజ్రాలు ఏర్పడుతాయి. వజ్రాలు తయార్చేందుకు అత్యంత తీవ్రమైన వేడితో పాటు పీడనం కూడా అవసరం.

వాస్తవానికి భూ అంతర్భాగంలో ఉష్ణోగ్రతలతో పాటు పీడనం సహజంగా ఎక్కువగానే ఉంటాయి. దాంతో వజ్రాలు ఏర్పడుతాయి. అదే తరహా పరిస్థితులను ల్యాబ్‌లలో ఏర్పాటు చేసి కృత్రిమంగా వజ్రాలను తయారు చేయనున్నారు. ల్యాబ్‌లో కృత్రిమ వజ్రాలను తయారు చేసేందుకు దాదాపు 1,600 సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత అవసరం, 50వేల అట్మాస్ఫియర్ పీడనం కావాలి. అంటే ఒక సెంటీమీటర్‌ స్థలంలో 50వేల కిలోల బరువు పెడితే వచ్చేంత ఒత్తిడి అన్నమాట. ఈ వజ్రం తయార్యేందుకు ఏకంగా 12రోజుల సమయం పడుతుంది. ఈ ఉష్ణోగ్రతను, పీడనాన్ని మెయింటైన్ చేయడం భారీగా ఖర్చుతో కూడుకున్న పని. తాజాగా కొరియా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ బేసిక్‌ సైన్స్‌ శాస్త్రవేత్తలు కొత్త విధానంలో వజ్రాలను ల్యాబ్‌లో అభివృద్ధి చేశారు.

గాలియం, ఐరన్, నికెల్, సిలికాన్ మూలకాలతో కూడిన కొత్త లిక్విడ్ మెటాలిక్ పదార్థాన్ని తయారు చేశారు. అందులో హైడ్రోజన్, మిథేన్‌తో కూడిన వాయువులను ఉంచి వేడిని, ఒత్తిడిని ఉపయోగించారు. ఈ విధానంలో 1,025 సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రతలోనే, మామూలుగా వాడే ఒత్తిడిలో పావువంతుతోనే సన్నని డైమండ్ పొరలు తయారయ్యాయి. దీనికి కొద్ది నిమిషాల సమయమే పట్టడం విశేషం. ఈ విధానాన్ని మరింత అభివృద్ధి చేస్తే.. పూర్తి స్థాయిలో వజ్రాలను తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. కొద్ది సంవత్సరాల్లోనే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని.. ఆ తర్వాత వజ్రాలు తక్కువ ధరకే లభించే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

Latest News