ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసినా…. ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయకున్నా ఆర్ధిక లావాదేవీల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీసులు అందుకోవాల్సిన పరిస్థితులు రావచ్చు. అందుకే ప్రతిపైసాకు లెక్క చూపిస్తే నోటీసులు అందుకోవాల్సిన పరిస్థితులు రావు.
ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసులు ఎప్పుడు వస్తాయి?
పరిమితికి మించి ఆదాయం కలిగి ఉంటే ప్రతి ఏటా ఆదాయ పన్ను రిటర్న్స్ సమర్పించాలి. ఆదాయానికి సంబంధించి పరిమితి మించకపోతే రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు. అయితే పన్ను చెల్లించే పరిధిలో లేకున్నా కొన్ని పరిస్థితుల్లో నోటీసులు వచ్చే అవకాశం ఉంది. పన్ను చెల్లించే ఆదాయం లేకున్నా ఒక్క ఆర్దిక సంవత్సరంలో చేసిన నగదు లావాదేవీలు పరిమితికి మించినా, ఆర్ధిక శాఖ నిబంధనలను అతిక్రమించినా నోటీసులు వస్తాయి. ఒక ఆర్ధిక సంవత్సరంలో రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఫిక్స్ డ్ డిపాజిట్లు చేసిన సమయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ డిపాజిట్లపై వచ్చే వడ్డీ పన్నుకు లోబడి ఉంటుంది. ఈ విషయాలపై ఐటీ శాఖ కన్నేస్తోంది. ఆదాయ మార్గాలను ఆదాయ పన్ను శాఖకు చెప్పాల్సిన పరిస్థితులు రావచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి కొన్ని ఆదాయాలను ప్రకటించడం మర్చిపోవడం కూడా ఇబ్బందులు కల్గించవచ్చు. తప్పుడు క్లైయిమ్ లు చేసినా ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీసులు అందే అవకాశం లేకపోలేదు. తక్కువ పన్ను చెల్లించినా, ఐటీ రిటర్న్స్ లో పూర్తి ఆదాయ వివరాలు తెలపకపోయినా నోటీసులు వచ్చే అవకాశం లేకపోలేదు.
డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిందే….
ఐటీ శాఖ నుంచి ఏదైనా డాక్యుమెంట్లు కావాలని అడిగితే వెంటనే వాటిని ఐటీ శాఖకు అందించాలి. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన సమయంలో రిటర్న్స్ సమయంలో సమర్పించిన సమయంలో జత చేసిన డాక్యుమెంట్లను సమీక్షించాలని భావిస్తే ఐటీ శాఖ ఈ నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉంది. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకపోతే దానికి సంబంధించి నోటీసులు కూడా రావచ్చు. ఆలస్యంగా రిటర్న్స్ ఫైల్ చేస్తే ఏడాదికి రూ. 5 వేలు జరిమానా కట్టాల్సి ఉంటుంది. అంతేకాదు రిటర్న్స్ దాఖలు చేయని సంవత్సరాల్లో పన్ను చెల్లించాల్సి వస్తే చెల్లించాల్సిన పన్నుకు ఏడాదికి 1 శాతం వడ్డీని వసూలు చేస్తారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేకపోతే ఈ విషయాన్ని ఐటీశాఖకు స్పష్టంగా లేఖ ద్వారా తెలపాలి.
జీవిత భాగస్వామిపై పెట్టుబడులు పెట్టినా…
తమ భార్య పేరుతో, పిల్లల పేరుతో, సన్నిహితుల పేరుతో చాలా మంది ఆస్తులు కొనుగోలు చేస్తారు. పన్ను ఎగవేసేందుకు ఇలా చేస్తారు. భూములు, భవనాలు, ఫిక్స్ డ్ డిపాజిట్లు మ్యూచువల్ ఫండ్స్, షేర్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టుబడి కిందకే వస్తాయి. ఉదహరణకు మీ భార్య పేరుతో షేర్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టారనుకుందాం. పెట్టుబడి నుంచి వచ్చే ఆదాయాన్ని మీ ఆదాయంగానే పరిగణిస్తారు. అందుకే దీనికి పన్ను విధిస్తారు.ఐటటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో ఈ విషయాలను ప్రస్తావించాలి.
నగదు లావాదేవీల విషయంలో
రూ. 30 లక్షలకు పైగా ఆస్తి కొనుగోలు లేదా అమ్మకం జరిగితే ఐటీ శాఖ దృష్టిలోకి వెళ్తోంది. ఈ విషయాలను ఐటీ రిటర్న్స్ లో ప్రస్తావించాలి. లేకపోతే నోటీసులు అందుతాయి. ఒక ఆర్ధిక సంవత్సరంలో రూ. 1 లక్ష నగదు లేదా రూ. 10 లక్షలకు పైగా క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించినా ఐటీ శాఖకు వివరాలు చేరుతాయి. ఇందుకు సంబంధించిన ఆదాయ వివరాలను తెలపాలి. ఒక ఆర్ధిక సంవత్సరంలో రూ. 10 లక్షలకు పైగా పెట్టుబడులు పెడితే (మ్యూచువల్ ఫండ్స్, షేర్స్) పెట్టుబడులు పెట్టినా ఆ విషయాలు ఐటీ శాఖకు తెలుస్తాయి.ఐటీ రిటర్న్స్ లో ఇవి చూపకపోతే చిక్కులు తప్పవు. విదేశాలకు వెళ్లిన సమయంలో రూ. 2 లక్షలకు పైగా ఖర్చు చేసినా ఐటీ పరిధిలోకి వస్తోంది. ఈ విషయాలను కూడా రిటర్న్స్ లో చూపాలి. ఈ జాగ్రత్తలు పాటించకపోతే ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసులు అందుకొనే అవకాశం లేకపోలేదు.
నోట్: ఇది అవగాహనకు మాత్రమే.. ఐటీ రిటర్న్స్ , పన్ను విషయాలపై నిపుణుల సలహాలు, సూచనలు పాటించాలి.