Actor Indrans| లేటు వయస్సులో కూడా చాలా మందికి ఉన్నత విద్యని అభ్యసించాలనే కోరిక ఉంటుంది. వారు చదువుకి వయస్సుతో సంబంధం లేదని నిరూపిస్తూ ఉంటారు. తాజాగా మలయాళం సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఇంద్రన్స్.. 68 ఏళ్ల వయస్సులో ఏడవ తరగతి పరీక్షలు రాసి అందరిని ఆశ్చర్యపరిచాడు. కేరళలోని అట్టకులంగర స్కూల్లో విద్యార్థులతో కలిసి 7వ తరగతి పరీక్షలు రాయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కుటుంబ ఆర్ధిక పరిస్థితుల నేపథ్యంలో చిన్నప్పుడు నాలుగో క్లాస్ వరకే చదువుకున్న ఇంద్రన్.. ఆ తర్వాత చదువు మానేసి టైలర్ గా మారాడు.పెద్దయ్యాక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న ఇంద్రన్స్ అనుకోకుండా సినీరంగం వైపు అడుగులు వేసి మంచి పేరు ప్రఖ్యాతలే సంపాదించుకున్నాడు. అయితే పాఠశాలకు వెళ్లలేకపోయినప్పటికీ.. ఇంద్రన్స్ కు చదువుపై మక్కువ ఎక్కువే. అందుకే ఈ వయస్సులో కూడా చదవడంపై ఎక్కువ దృష్టి సారించాడు.ఇంద్రన్‌కి 10వ తరగతి పాస్ కావాలనే కోరిక చాలా ఉండేది. అయితే పదో తరగతి పాస్ కావాలి అంటే ఫస్ట్ 7వ తరగతి పాస్ కావాలనే రూల్ ఉంది. ఈ క్రమంలోనే తాజాగా తిరువనంతపురంలోని అట్టకుళంగర సెంట్రల్ స్కూల్‌లో ఏడో తరగతి పరీక్షలు రాశాడు. అందరు విద్యార్ధులతో కలిసి ఆయన పరీక్ష రాస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇక ఇంద్రన్ సినిమాల విషయానికి వస్తే..1980 నుంచి ఇంద్రన్ మలయాళంలో పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. గతేడాది రిలీజైన ‘2018’ అనే డబ్బింగ్ మూవీలో అంధుడి పాత్ర పోషించిన ఇంద్రన్‌కి ఉత్తమ నటుడిగా కేరళ ఫిల్మ్ అవార్డు సైతం దక్కింది. ఇంద్రన్స్ 10వ తరగతికి రాగానే కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్ బ్రాండ్ అంబాసిడర్ గా అతడిని ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే అతడి పేరును ప్రభుత్వానికి సిఫార్సు చేసేందుకు అక్షరాస్యత మిషన్ సిద్ధం అవుతుంది. ఇంద్రన్‌కు చదువుపై ఉన్న ఎనలేని అభిరుచి అంబాసిడర్‌గా సామాన్యులకు స్ఫూర్తినిస్తుంది కాబట్టే అతడిని అంబాసిడర్‌గా చేస్తున్నట్టు డైరెక్టర్ ఏజీ ఒలీనా తెలిపారు.