తెలంగాణ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) చేసిన వ్యాఖ్యలపై నాగ చైతన్య సోదరుడు అఖిల్ అక్కినేని(Akhil Akkineni) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి వ్యాఖ్యలను ‘నిరాధారమైన, అమానవీయమైన, అసభ్యకరమైన మరియు అసహ్యకరమైనవి(baseless, ridiculous, vulgar and disgusting)’ అని ఆయన అభివర్ణించారు. ఆమె ప్రవర్తించిన విధానం సమాజంలో సిగ్గుచేటైనదని, ఏ మాత్రం క్షమించరానిదని అని అఖిల్ తన కోపాన్ని వ్యక్తపరిచారు. ఇటువంటి వ్యక్తులకు సభ్యసమాజంలో చోటు లేదు, ఉండకూడదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.
సినీనటుడు నాగార్జున(Nagarjuna Akkineni) చిన్న కొడుకైన అఖిల్, తన అన్న నాగ చైతన్య(Naga Chaitanya), సమంత(Samantha)ల విడాకులపై తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించారు. అఖిల్ ఆమె వ్యాఖ్యలను నిరాధారమైనవిగా, అసభ్యకరమైనవిగా, అసహ్యకరమైనవిగా అభివర్ణించారు. సురేఖ వ్యాఖ్యలపై తన తల్లి అమల(Amala Akkineni) చేసిన ఆరోపణలను సమర్థిస్తూ, సురేఖ ఓ సమాజ విద్రోహి(Sociopath) అని అన్నారు. అఖిల్ తన ఎక్స్ ఖాతాలో ఈ మేరకు ఓ సుదీర్ఘ పోస్టు పెట్టారు. అందులో ఆయన మాట్లాడుతూ, ఈ సంఘటనతో తన కుటుంబసభ్యులు ఎంతో మనోవేదనకు, అగౌరవానికి గురయ్యారని , ఆ మహిళామంత్రి పూర్తిగా సమాజ సంక్షేమాన్ని, విలువలను మర్చిపోయారని ఆక్షేపించారు. ఓ ప్రజాప్రతినిధిగా ఉంటూ, ప్రజల సంక్షేమాన్ని కోరుకోవాల్సింది పోయి, కనీస మానవత్వపు విలువల(morals and social welfare)ను మర్చిపోవడం సిగ్గుచేటైన విషయమని, ఏ మాత్రం క్షమించారానిదని, సమాజంలో గౌరవనీయ స్థానంలో ఉన్న తన కుటుంబసభ్యులను ఆమె తీవ్రంగా అవమానించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.
కొండా సురేఖకు తగిన గుణపాఠం నేర్పాలని, తనలాంటి సంస్కారహీనులకు ఈ సమాజంలో స్థానం లేదని (no space or forgiveness) అఖిల్ అంటూ, ఈ విషయాన్ని ఇంతటితో వదిలే ప్రసక్తే లేదని, దోషులకు శిక్ష పడాల్సిందే(Justice must be served)నని స్పష్టం చేసారు.
కాగా, సమంతకు సోషల్ మీడియా ద్వారా క్షమాపణ తెలిపిన సురేఖ, మళ్లీ నిన్న తిరిగి అవే వ్యాఖ్యలు చేసారు. సినిమా పరిశ్రమలోని దగ్గరి వ్యక్తుల ద్వారా ఈ సమాచారం తనకు తెలిసిందని, అందుకే అలా మాట్లాడానని అంటూ, ఒకవేళ కేటీఆర్కు సంబంధం లేకపోతే వారెందుకు విడాకులు తీసుకున్నారో చెప్పాలన్నారు. దీంతో ఈ రగడ మళ్లీ మొదటికొచ్చింది. మరోపక్క సురేఖపై నాగార్జున నిన్నపరువునష్టం దావా వేసారు. సెక్షన్ 356 బీఎన్‌ఎస్ కింద చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. అయితే న్యాయమూర్తి సెలవులో ఉండటంతో విచారణ వాయిదా పడింది. సోమవారం దీనిపై విచారణ జరుగనుంది.