CM Revanth Reddy | తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతాల్లో కోత.. దీనిపై చట్టం తీసుకొస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతాల్లో 10 శాతం కోత విధిస్తాం.. దీనిపై త్వరలో చట్టం తీసుకువస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిస్సాహయకులైన వారికి సహాయం అందించడం మన బాధ్యత అని కొత్తగా గ్రూప్ -2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి సూచించారు.

CM Revanth Reddy | విధాత : తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతాల్లో 10 శాతం కోత విధిస్తాం.. దీనిపై త్వరలో చట్టం తీసుకువస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిస్సాహయకులైన వారికి సహాయం అందించడం మన బాధ్యత అని కొత్తగా గ్రూప్ -2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి సూచించారు. శనివారం శిల్పాకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో గ్రూప్-2 ఉద్యోగాలు ఎంపికైన 783 మందికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావు లతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. తల్లిదండ్రులు, పుట్టి పెరిగిన ఊరును అభివృద్ధి చేసుకోవాలి. ఇది మనందరి బాధ్యత అని చెప్పారు. తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతాల్లో కోత విధించి ఆ డబ్బును మీ తల్లిదండ్రుల ఖాతాలో వేస్తానన్నారు. మీకు ఎలాగైతే ఒకటో తారీఖునా జీతాలు పడుతాయో.. వారికి కూడా బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. దీని కోసం అసెంబ్లీలో త్వరలో చట్టం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

శ్రీకాంతాచారి, ఇషాన్ రెడ్డి, యాదయ్య లాంటి ఎందరో ప్రాణ త్యాగాలతో తెలంగాణ సిద్ధించిందన్నారు. యూనివర్సిటీల్లో ఉంటూ విద్యార్థులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని సీఎం గుర్తు చేశారు. కానీ, ఆనాటి నాయకులు నీళ్లు..నిధులు..నియామకాలు అనే నినాదంతో అధికారంలోకి వచ్చి పదేళ్లు పాలించారన్నారు. కానీ, వాళ్ల కుటుంబ సభ్యులకు పదవులు ఇచ్చి శ్రీమంతులు చేశారని, నిరుద్యోగులను పట్టించుకోలేదని గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులకు ప్రాధాన్యతనిచ్చిందన్నారు. 3 కోట్ల రూపాయలను తీసుకుని గ్రూప్-1 ఉద్యోగాలు పొందారని గత పాలకులు ఆరోపణలు చేశారని, అసలు పేదింటి బిడ్డలు రూ.3 కోట్లు పెట్టగలరా? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. కష్టపడి చదివిన వారిని అవమానించేలా మాట్లాడారు. గతంలో ఎన్నడు లేని విధంగా దేశంలో కులగణన సాధ్యం కానుందని అని రేవంత్ వెల్లడించారు. లక్షల వెచ్చించి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అయిందని ఇలాంటి ఘటన ప్రపంచంలో ఎక్కాడా జరగలేదని సీఎం రేవంత్ విమర్శలు గుప్పించారు.