Summer | తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. భానుడి భగభగలకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. మార్చి మొదటి వారంలోనే ఎండలు ఇలా ఉంటే ఏప్రిల్, మే నాటికి మరింత ముదిరే అవకాశం ఉందని బెంబేలెత్తిపోతున్నారు.
ఈ ఏడాదిలో తొలిసారిగా గురువారం రోజు ములుగు జిల్లా మంగపేటలో అత్యధికంగా 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఆదిలాబాద్ అర్బన్, ధర్మపురి, ఖమ్మం అర్బన్ ఏరియాల్లో 38.9 డిగ్రీలు, మరో 14 జిల్లాల్లో 38.5 డిగ్రీల సెల్సియస్ పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
శుక్రవారం 6 జిల్లాల్లో 40 డిగ్రీలపైన నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు
జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ వారంలో చాలా జిల్లాల్లో సాధారణం కన్నా 1 నుంచి 1.5 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి
ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, చిన్న పిల్లలు మధ్యాహ్నం సమయంలో చల్లని ప్రదేశాలకే పరిమితం కావాలని సూచిస్తున్నారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా.. నిమ్మరసం తాగాలన్నారు. ఈ ఎండాకాలంలో ద్రవ పదార్థాలు తీసుకుంటే మంచిదని చెబుతున్నారు.
