Rain Alert | హైద‌రాబాద్ : మండుటెండ‌ల‌కు అట్టుడికి పోతున్న రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు వాతావ‌ర‌ణ శాఖ చ‌ల్ల‌ని క‌బురు అందించింది. జూన్ 6వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. శుక్ర‌వారం కూడా ప‌లు ప్రాంతాల్లో తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురుస్తాయ‌ని పేర్కొంది.

వ‌ర్షాల కార‌ణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్ర‌త‌లు కాస్త త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. జూన్ 6 నుంచి 36 -40 డిగ్రీల మ‌ధ్య ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు కానున్న‌ట్లు పేర్కొంది. దీంతో ఎండ వేడిమి నుంచి ప్ర‌జ‌లు ఉప‌శ‌మ‌నం పొంద‌నున్నారు.

రాబోయే రెండు రోజుల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల‌, నిర్మ‌ల్, నిజామాబాద్, న‌ల్ల‌గొండ‌, సూర్యాపేట‌, మ‌హ‌బూబాబాద్, వ‌రంగ‌ల్, హ‌నుమ‌కొండ‌, జ‌న‌గామ‌, సిద్దిపేట జిల్లాలో ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. ఈ స‌మ‌యంలో గంట‌కు 50 నుంచి 60 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవ‌కాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

ఈ రెండు రోజుల్లో యాదాద్రి, రంగారెడ్డి, హైద‌రాబాద్, మ‌ల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెద‌క్, కామారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, నాగ‌ర్‌క‌ర్నూల్, వ‌న‌ప‌ర్తి, నారాయ‌ణ‌పేట‌, గ‌ద్వాల జిల్లాల్లో తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

ఇక శ‌నివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు కురియ‌నున్నాయి. బ‌ల‌మైన ఈదురుగాలులు కూడా వీచే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. ఈ నేప‌థ్యంలో రైతులు, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది.