• Telugu News
  • /National

Asiatic Lion Cubs | గిర్ అడవుల్లో 8 సింహాలు మృతి.. ఎండదెబ్బనే కారణమంట!!

Asiatic Lion Cubs | గుజరాత్‌లోని గిర్ అభయారణ్యంలో ఇటీవల ఎనిమిది సింహం పిల్లలు మరణించడం ఆందోళనకు గురిచేసింది. సింహాల వరుస మరణాలకు బబేసియా అనే పరాన్న జీవి సంక్రమణ లేదా ఇతర ప్రమాదకరమైన వైరస్‌లు కారణమని తొలుత పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

Reported by: Chandram | జాతీయం | Jun 07, 2026, 8:21 pm IST
Read Time: 4 mins
Asiatic Lion Cubs | గిర్ అడవుల్లో 8 సింహాలు మృతి.. ఎండదెబ్బనే కారణమంట!!

Asiatic Lion Cubs | గుజరాత్‌లోని గిర్ అభయారణ్యంలో ఇటీవల ఎనిమిది సింహం పిల్లలు మరణించడం ఆందోళనకు గురిచేసింది. సింహాల వరుస మరణాలకు బబేసియా అనే పరాన్న జీవి సంక్రమణ లేదా ఇతర ప్రమాదకరమైన వైరస్‌లు కారణమని తొలుత పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే వాటి మరణానికి వైరస్ కారణం కాదని.. తీవ్రమైన ఎండల కారణంగానే వడదెబ్బ తగిలి అవి మృతిచెందాయని గుజరాత్ అటవీ శాఖ మంత్రి అర్జున్ మోద్వాడియా స్పష్టం చేశారు. తీవ్ర ఎండల ప్రభావంతో సింహపు పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోవడమే వాటి మరణాలకు కారణమని వెల్లడించారు.

గిర్ అభయారణ్య పరిసర ప్రాంతాల్లో స్వల్ప వ్యవధిలోనే ఎనిమిది ఆసియాటిక్ సింహపు పిల్లలు మరణించడం గత నెలలో సంచలనం సృష్టించింది. దీంతో బబేసియా అనే పరాన్నజీవి సంక్రమణ వల్లనే అవి చనిపోయి ఉంటాయని అటవీ అధికారులు తొలుత అనుమానించారు. ఈ క్రమంలోనే మే 29వ తేదీన శాంపిల్స్‌ను తీసుకుని గాంధీనగర్‌లోని గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్‌కు పంపించారు. అక్కడ నమూనాలపై పరీక్షలు జరిపిన అనంతరం.. ఆ పరాన్నజీవి లేదా ఇతర ప్రమాదకర వైరస్‌ల వల్ల మరణాలు సంభవించినట్లుగా ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిసింది. ఈ మేరకు ఆ నివేదికను మంత్రి అర్జున్ మోద్వాడియా వెల్లడించారు. ఎండల తీవ్రత కారణంగా రోగ నిరోధక శక్తి తగ్గి సింహపు పిల్లలు మరణించాయని నివేదికలో తెలిసిందని తెలిపారు.

వైరస్ ముప్పు ఉందన్న ప్రాథమిక అనుమానంతో అటవీ శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. సంక్రమణ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభావిత ప్రాంతాల చుట్టూ 10కిలోమీటర్ల పరిధిలోని సింహాలను ఐసోలేషన్‌లోఉంచారు. గిర్ పరిసర ప్రాంతాల్లోని దాదాపు 600 సింహాలకు పేలు నివారణ, నులిపురుగుల నిర్మూలన చికిత్సలు అందించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా అనారోగ్యానికి గురైన 17 సింహాలను ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు. అయితే వాటిలో 12 సింహాలు పూర్తిగా కోలుకున్నాయని.. దీంతో వాటిని అడవిలోకి సురక్షితంగా వదిలేసినట్లు మంత్రి తెలిపారు. మిగిలిన ఐదు సింహాల ఆరోగ్య పరిస్థితి కూడా ప్రస్తుతం మెరుగ్గా ఉందని.. త్వరలో వాటిని కూడా అడవిలోకి పంపిస్తామని పేర్కొన్నారు.

ఇటీవల కాలంలో వ్యాధుల కారణంగా సింహాలు మరణించలేదని మంత్రి స్పష్టం చేశారు. ఒక సింహం మాత్రం గర్భధారణకు సంబంధించిన సమస్యలతో మృతిచెందిందని తెలిపారు.