విధాత: తెలంగాణలో పాఠశాలల పునః ప్రారంభం తేదీలలో విద్యాశాఖ మార్పులు చేసింది. వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని అన్ని పాఠశాలల వేసవి సెలవులను ఈ నెల 15వరకు పొడిగించింది. తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగానే కొనసాగుతున్నాయి. తీవ్ర ఎండల నేపథ్యంలో ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకుని వేసవి సెలవులను పొడిగించింది. పాఠశాలల పునః ప్రారంభం తేదీని ఈ నెల 12కు బదులుగా 15వ తేదీకి మార్చింది. వేసవి సెలవులు పొడిగించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని రోజులు పిల్లలు ఇంటి వద్దే సురక్షితంగా ఉండే అవకాశం లభించిందని వారు అభిప్రాయపడుతున్నారు.
అదే సమయంలో పాఠశాలల యాజమాన్యాలు పునఃప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వం సూచించింది. కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన కార్యకలాపాలకు అనుగుణంగా అవసరమైన సన్నాహాక చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.