Government Schools | స‌ర్కారు బ‌డుల్లో స‌రికొత్త బోధ‌న‌.. అత్యాధునిక ప‌ద్ధ‌తుల్లో టీచింగ్ : సీఎం రేవంత్‌రెడ్డి

  • By: TAAZ    news    Jun 15, 2025 10:49 PM IST
Government Schools | స‌ర్కారు బ‌డుల్లో స‌రికొత్త బోధ‌న‌.. అత్యాధునిక ప‌ద్ధ‌తుల్లో టీచింగ్ : సీఎం రేవంత్‌రెడ్డి

Government Schools | ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను బ‌లోపేతం చేసేలా రేవంత్ స‌ర్కార్ ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌ను తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. స‌ర్కారు బ‌డుల్లో మెరుగైన విద్య అందించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఇప్ప‌టికే విద్యాశాఖ‌ను ఆదేశించారు. కాగా తాజాగా రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో అత్యాధునిక ప‌ద్ధ‌తుల్లో బోధ‌న అందించ‌నున్నారు. ఇందుకోసం ప్ర‌ముఖ ఎన్‌జీవో సంస్థ‌ల‌తో రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంవోయూ కుదుర్చుకున్న‌ది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఆరు ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన ఎడ్​ టెక్​ సదుపాయాలను కల్పించనున్నారు. ఇందుకు నందన్ నీలేకణి నేతృత్వంలోని ఎక్‌స్టెప్ ఫౌండేషన్, డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలక్​ పాండే అధ్వర్యంలోని ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ, షోయబ్​దార్​ నిర్వహిస్తున్న పైజామ్ పౌండేషన్, సఫీనా హుస్సేన్​ అధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్ లాంటి పేరొందిన సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఒప్పందాలు చేసుకున్నది.

విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పేరొందిన సంస్థల భాగస్వామ్యంతో రాష్ట్ర విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలన్నముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నది. ఎక్‌స్టెప్ ఫౌండేషన్ కృత్రిమ మేథ ఆధారిత ప్లాట్‌ ఫారమ్‌తో 540 పాఠశాలలలో పని చేయనున్నది. భవిష్యత్ లో 33 జిల్లాల పరిధిలో 5,000కి పైగా ప్రాథమిక పాఠశాలలకు విస్తరించనున్నది. మూడో తరగతి నుంచి 5వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లిష్​ భాషలతో పాటు మ్యాథ్స్​ బేసిక్స్​ను ఈ సంస్థ అందిస్తుంది.

ఇంటర్ విద్యార్థులకు శిక్షణ

ఫిజిక్స్ వాలా ఇంటర్​ విద్యార్థులకు నీట్​, జేఈఈ, క్లాట్​ పరీక్షలకు సన్నద్ధులను చేస్తుంది. పాఠశాల స్థాయి నుంచే పోటీ పరీక్షల దృక్కోణంలో విద్యార్థులకు ఉచిత శిక్షణ అందిస్తుంది. ఖాన్ అకాడమీ రాష్ట్రంలో 6వ తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలకు అనుగుణంగా వీడియో ఆధారిత (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) శిక్షణను అందజేస్తుంది. డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలో ప్రజ్వల ఫౌండేషన్ 6వ తరగతి నుంచి క్లాస్​ 12 వరకు విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా బాల సురక్ష, రక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తుంది. పైజామ్ ఫౌండేషన్ ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు కోడింగ్, కంప్యూటేషనల్ థింకింగ్ పై శిక్షణను అందిస్తుంది. ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ రాష్ట్రంలో పాఠశాలలకు దూరంగా ఉన్న 16 వేలకు పైగా పిల్లలను తిరిగి బడిలో చేర్పించటంతో పాటు , బాలికల అక్షరాస్యత మరియు విద్యా అవకాశాలను మెరుగుపరుస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రటరీ హరిత, ఎక్‌స్టెప్ ఫౌండేషన్ సీఈవో జగదీష్ బాబు, ప్రజ్వల ఫౌండేషన్ చీఫ్ డాక్టర్ సునీతా కృష్ణన్, ఫిజిక్స్ వాలా కో-ఫౌండర్ ప్రతీక్ మహేశ్వరి, ఖాన్ అకాడమీ ఇండియా ఎండీ స్వాతి వాసుదేవన్ , పైజామ్ పౌండేషన్ ఫౌండర్ షోయబ్ దార్ , ఎడ్యుకేట్ గర్ల్స్ సిఈవో గాయత్రి నాయిర్ లోబో, తదితరులు పాల్గొన్నారు.