- సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి దామోదరకు ధన్యవాదాలు
- తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి
హైదరాబాద్, విధాత:
Employees JAC | ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు అన్ని రకాలుగా దోహదపడేలా ఆదర్శవంతమైన ఆరోగ్య, బీమా పథకాలను ప్రభుత్వం ప్రకటించడం పట్ల తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వీ లచ్చిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం ప్రకటించిన ఆరోగ్య, బీమా పథకాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. బీమాతో కూడిన ఆరోగ్య పథకం అమలు అనేది రాష్ట్రంలోని ఉద్యోగులకు గొప్ప వరంగా అభివర్ణించారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి నేతృత్వంలో జేఏసీలోని వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డిని, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహలను వేర్వేరుగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. వీటి ఆమోదానికి సహకరించిన ప్రభుత్వ పెద్దలకు కూడా కృతజ్ఞతలు చెప్పారు.
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కృషి ఫలితమే..
రాష్ట్రంలోని ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వం రూ.1.20 కోట్ల ప్రమాద బీమాను వర్తింప చేయడం అనేది గొప్ప సాహసమని ఈ సందర్భంగా లచ్చిరెడ్డి పేర్కొన్నారు. ఇదే కాకుండా రూ.1,056 కోట్ల మూల నిధితో ఉద్యోగుల, పెన్షనర్ల ఆరోగ్య పథకం అమలు కూడా మంత్రి వర్గ ఆమోదం తెలుపడం చాలా గొప్ప నిర్ణయంగా పేర్కొన్నారు. 652 గుర్తింపు పొందిన ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులలో 1,998 వ్యాధులకు నగదు రహిత చికిత్సలను పొందే విధంగా వెసులుబాటు కల్పించిందన్నారు. దీనికంతటికీ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కృషి ఫలితమే కారణమన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఉద్యోగులకు సంబంధించిన ఆదర్శవంతమైన ఆరోగ్య పథకం ప్రవేశ పెట్టి అమలు చేయాలని పలుమార్లు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లామని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసుతో ఉద్యోగులకు, పింఛనుదారుల కోసం ఆదర్శవంతమైన ఆరోగ్య, బీమా పథకాలను ప్రవేశ పెట్టి అమలుకు ముందుకు రావడం దేశంలోనే ఆదర్శంగా నిలిచిపోతుందన్నారు.
నెలలోపే డిజిటల్ హెల్త్ కార్డులు..
రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ నగదు రహిత ఆరోగ్య పథకాన్ని అమలుతో పాటు అందరికీ డిజిటల్ హెల్త్ కార్డులను కూడా అందించనున్నట్టుగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. ఈ ప్రక్రియను చేపట్టి నెలలోపే పూర్తి చేయనున్నట్టుగా తెలిపారని లచ్చిరెడ్డి చెప్పారు.
సీఎం దృష్టికి కంప్యూటర్ ఆపరేటర్ల సమస్య..
రాష్ట్రంలోని రెవెన్యూ విభాగంలో పని చేస్తున్న 632 మంది కంప్యూటర్ ఆపరేటర్ల సమస్యను ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి లచ్చిరెడ్డి తీసుకెళ్లారు. సీఎం ఈ విషయంపై సానుకూలంగా స్పందించారని లచ్చిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నాయకులు కే రామకృష్ణ (డిప్యూటీ కలెక్టర్ల సంఘం), ఎస్ రాములు, రమేశ్ పాక, సీహెచ్ శ్రీనివాస్ (తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్), బాణాల రాంరెడ్డి, వి.భిక్షం (తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్), డాక్టర్ నిర్మల, ఎల్.దశరథ్ (టీజీసీపీఎస్ఈయూ), గరికె ఉపేందర్‌రావు (జీపీవో), సుగంధిని (హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్‌డబ్ల్యూ), భూమేశ్, సునీల్, తదితరులు పాల్గొన్నారు.
