Rajya Sabha Elections | రాజ్యసభ బరిలో బీఆర్ఎస్ అభ్యర్థి.. ఫిరాయింపుదారులకు చెక్ పెట్టేందుకేనా! ఇదీ లెక్కల చిక్కు!

ఒక రాజ్యసభ సభ్యుడిని ఎన్నిక చేసేందుకు 41 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థులను నిలబెడితే 82 మంది సభ్యుల ఓట్లు అవసరం ఉంటుంది. కానీ కాంగ్రెస్‌కు 64 మంది ఉండగా, సీపీఐ సభ్యుడితో కలిపితే సంఖ్య 65 అవుతుంది. మిగతా 18 మంది సభ్యులు ఎవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

విధాత, హైదరాబాద్:

Rajya Sabha Elections | రాష్ట్రంలో రెండు స్థానాలకు జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో పోటీ చేయాలని బీఆర్ఎస్ అగ్రనాయకత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి పోటీ చేసేందుకు తగిన సభ్యుల బలం లేనప్పటికీ, ఫిరాయింపు ఎమ్మెల్యేల సంగతి తేల్చేందుకే పోటీలో ఉండాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయానికి వచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వి, బీఆర్ఎస్ నుంచి కేఆర్ సురేశ్‌ రెడ్డి పదవీకాలం ఏప్రిల్ నెలాఖరుకు ముగియనుండడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) షెడ్యూలు ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి 16వ తేదీన తెలంగాణ అసెంబ్లీలో రెండు రాజ్యసభ సీట్లకు పోలింగ్ నిర్వహించనున్నారు.

సింఘ్వీకి మరో చాన్స్‌

ఈ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులను బరిలోకి దించాలనే యోచనతో కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో చర్చించారని సమాచారం. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీకి మరోసారి అవకాశం కల్పించనున్నారు. రెండో సీటుకు ఇటీవలే ఉప రాష్ట్రపతి పదవికి పోటీ చేసిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డితో పాటు మరికొందరి పేర్లు పరిశీలనకు వచ్చాయి. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కూడా తమ పార్టీ నుంచి ఒకరిని బరిలోకి దించాలనే నిర్ణయం దాదాపుగా తీసుకున్నారని అంటున్నారు. ప్రస్తుత అసెంబ్లీలో మొత్తం 119 మంది సభ్యులు ఉండగా, బీఆర్ఎస్ పార్టీకి 37 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 10 మంది వరకు కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా ఉంటూ, బీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో కేసు కూడా వేసింది. పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేయగా, అందులో ఎనిమిది మంది పై పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. మరో ఇద్దరు సభ్యుల పిటిషన్లు ట్రిబ్యునల్ లో పెండింగ్ లో ఉన్నాయి. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది. ఇదిలా ఉండగా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కొద్ది రోజులుగా మళ్లీ బీఆర్ఎస్ నాయకత్వంతో సన్నిహితంగా ఉంటూ, కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్నారు. మిగతావారు మాత్రం తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని అసెంబ్లీ స్పీకర్ ముందు, సుప్రీంకోర్టులో వాదిస్తున్నప్పటికీ, కాంగ్రెస్ తోనే కొనసాగుతున్నారు. ఇప్పటికీ తమ వేతనాల నుంచి బీఆర్ఎస్ పార్టీకి చందాలు చెల్లిస్తున్నామని చెప్పి నమ్మబలికే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎవరికీ సరిపోని సభ్యుల సంఖ్య

ఒక రాజ్యసభ సభ్యుడిని ఎన్నిక చేసేందుకు 41 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థులను నిలబెడితే 82 మంది సభ్యుల ఓట్లు అవసరం ఉంటుంది. కానీ కాంగ్రెస్‌కు 64 మంది ఉండగా, సీపీఐ సభ్యుడితో కలిపితే సంఖ్య 65 అవుతుంది. మిగతా 18 మంది సభ్యులు ఎవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ ఎంఐఎం పార్టీ ముందుకు వస్తే ఆ పార్టీకి ఉన్న సభ్యులు ఏడుగురే. అదనంగా మరో 11 మంది సభ్యుల బలం అవసరం ఉంటుంది. ఒకవేళ 8 మంది బీజేపీ సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉంటే ఒక్కో రాజ్యసభ సీటుకు 38 మంది ఓటు చొప్పున 76 మంది సభ్యులు ఓటు వేస్తే సరిపోతుంది. కాంగ్రెస్, సీపీఐ, ఎంఐఎం కలిస్తే ఆ సంఖ్య 72 అవుతుంది. అయినా నాలుగు ఓట్లు తగ్గుతాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ లెక్కలు, అంచనాలు కూడా వేరే విధంగా ఉన్నాయి. బీఆర్ఎస్ కు కూడా ఒకరిని పోటీలోకి దింపితే 41 మంది సభ్యుల బలం అవసరం. పార్టీ ఫిరాయించిన వారితో ఆ సంఖ్య 37 కాగా, మరో నలుగురి సభ్యుల మద్ధతు తీసుకోవాల్సి ఉంటుంది. మద్ధతు కోసం ఎంఐఎం నాయకత్వంతో సంప్రదించాలనే యోచనలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఉన్నారని పార్టీ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఒకవేళ ఎంఐఎం మద్ధతుకు అంగీకరిస్తే బీఆర్ఎస్ బలం 44కు పెరిగి సునాయసంగా గెలుపొందే అవకాశాలున్నాయని అంటున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ప్రతి సభ్యుడు తమ పార్టీ ఏజెంట్ కు బ్యాలెట్ పేపర్ లో ఎవరికి ఓటు వేస్తున్నామో చూపించి, ఆ తరువాతే బ్యాలెట్ బాక్స్ లో వేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన కలిసి వస్తుందనే విశ్వాసంతో పార్టీ నాయకత్వం ఉంది. అయితే పార్టీ విప్ కూడా ఇక్కడ పనిచేయదు. దీంతో ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి.

ఎంఐఎం తో జాగ్రత్త

హైదరాబాద్ పాత బస్తీకి చెందిన ఎంఐఎం పార్టీ నాయకత్వంతో జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులను హెచ్చరించినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీతో సన్నిహితంగా ఉండొద్దని ఆయన సున్నితంగా మందలించడంతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఆత్మరక్షణలో పడింది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఎంఐఎంతో బహిరంగంగా సంబంధాలు పెట్టుకోవడం మూలంగా పట్టణ ప్రాంతాల్లో బీజేపీని మరింత బలోపేతం చేయగలవని, ఈ బంధాలు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ను దెబ్బతీస్తాయని ఆయన హెచ్చరిక చేశారంటున్నారు. దీంతో రెండు రాజ్యసభ సీట్లను దక్కించుకునేందుకు ఏం చేయాలనే దానిపై రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు.

Latest News