Virosh | టాలీవుడ్‌లో ఇటీవల జరిగిన అత్యంత చర్చనీయాంశమైన వివాహాల్లో విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి ఒకటి. ఫిబ్రవరి 26న కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అనంతరం విజయ్ సొంతూరిలో సత్యనారాయణ వ్రతం నిర్వహించగా, ఆ తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ వేడుకను ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యుడు డాక్టర్ గురవా రెడ్డి చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. విరోష్ దంపతుల రిసెప్షన్‌లో పాల్గొన్న ఆయన, ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఆసక్తికరమైన విషయాలను తన పోస్ట్‌లో వెల్లడించారు.
డాక్టర్ గురవా రెడ్డి తన పోస్ట్‌లో రష్మిక మందన్నతో తనకు ఉన్న పాత పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘సామి సామి’ పాటకు స్టెప్పులు వేస్తూ మోకాళ్ల నొప్పితో కొన్నేళ్ల క్రితం రష్మిక తనను కలిసిందని తెలిపారు. అప్పట్లో చికిత్స తీసుకున్న ఆమె ఇప్పుడు మాత్రం తన జీవిత భాగస్వామితో కలిసి సంగీత్ వేడుకలో మళ్లీ డ్యాన్స్ చేస్తూ ఎంతో ఆనందంగా కనిపించిందని చెప్పారు.రిసెప్షన్ సందర్భంగా జరిగిన ఓ సరదా ఘటనను కూడా ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. సంగీత్‌లో ఎక్కువగా డ్యాన్స్ చేయడంతో మళ్లీ మోకాళ్ల నొప్పి వస్తోందని రష్మిక తన చెవిలో చెప్పిందని, ఈసారి మాత్రం తాను ఒక్కడే కాదు… విజయ్ కూడా తన దగ్గరకు పేషెంట్‌గా రావాల్సి వస్తుందని సరదాగా చెప్పిందని గురవా రెడ్డి పేర్కొన్నారు.
అంతేకాదు, విజయ్ దేవరకొండను టాలీవుడ్ ‘అర్జునుడు’గా పేర్కొంటూ… తన విజయాలతో ‘శ్రీవల్లి’ లాంటి మంచి జీవిత భాగస్వామిని వరించాడని ఆయన అభినందించారు. నిజమైన ప్రేమ, పరస్పర గౌరవం ఉన్న జంటలను చూడటం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని కూడా తన భావాలను వ్యక్తం చేశారు.ఇక చివరగా ఈ జంట మరెన్నో మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించడంతో పాటు, జీవితంలో కూడా ఒకరినొకరు ప్రేమిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. డాక్టర్ గురవా రెడ్డి చేసిన ఈ భావోద్వేగపూరిత పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ విరోష్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
