Bigg Boss | బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నది. తమిళంలో ఎనిమిదో సీజన్ ఈ నెల 6న ప్రారంభమైంది. ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. విజయ్ సేతుపతి హోస్టింగ్‌తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. గతవారంలో కంటెస్టెంట్స్‌ని పలు సున్నితమైన ప్రశ్నలు అడిగిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకున్నది. ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ తొలి కంటెస్టెంట్‌గా బీబీహౌస్‌లోకి అడుగుపెట్టగా.. మొదటివారంలోనే ఆయన బయటకు వెళ్లిపోయారు. శారీరక సమస్యలతోనే ఆయన తప్పుకున్నట్లు తెలుస్తున్నది. తనను బయటకు పంపాలని షో నిర్వాహకులను కోరడమే ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. ఇక ప్రస్తుతం బిగ్‌బాస్ రెండోవారం కొనసాగుతున్నది. ఈవారం ఎవరు బయటకు వెళ్తారనేది చర్చనీయాంశంగా మారింది.
ఇక చెన్నైలో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో బీబీహౌస్‌లోకి వరద నీరు చేరిందని.. ఈ క్రమంలో షో కొనసాగుతుందా? లేక మధ్యలోనే ఆపేస్తారా? సస్పెన్స్‌గా మారింది. కుండపోత వర్షాల కారణంగా ఇప్పటికే చెన్నైతో పాటు పరిసర జిల్లాల్లో భారీగా వరదలు పోటెత్తుతున్నాయి. దాంతో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించగా.. పలు సంస్థలు ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం ప్రకటించారు. వర్షాలకు చెన్నైలో కనుచూపుమేరలో అంతా నీరు కనిపిస్తున్నది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ప్రభుత్వం తరలిస్తున్నది. చెన్నైలోని చెంబరంబాక్కం, పూజల్ ప్రాంతాల్లో భారీగా నీటిమట్టం పెరిగింది. చెంబరంబాక్కం దిగువన ప్రాంతంలో ఉన్నందున వరద నిలిచిపోతున్నది. తమిళ బిగ్‌బాస్ 8వ సీజన్ సెట్‌ని సైతం అక్కడే వేశారు. చెంబరబాక్కలో నీరు నిలువడంతో బీబీహౌస్ వరకు నీరు చేరిందని.. దాంతో షోను కొనసాగించడం కష్టంగా మారిందని తెలుస్తున్నది.
వాస్తవానికి బిగ్‌బాస్-4 సీజన్ సమయంలోనూ భారీ వర్షాలకు బీబీహౌస్‌లోకి నీరు వచ్చింది. దాంతో ఒకరోజు రాత్రి హోటల్ బస చేసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. మరి ఈసారి కూడా కంటెస్టెంట్స్‌ని హోటల్‌కు తరలిస్తారా? లేకపోతే షోని ఆపేస్తారా? అన్నది సస్పెన్స్‌గా మారింది. అయితే, ప్రస్తుతం హౌస్‌లోకి నీరు రాకుండా అడ్డుకునేందుకు నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు. మరో వైపు చెంబరంబాక్కలో వరద పరిస్థితులతో అటు కంటెస్టెంట్స్ కుటుంబాలు, అభిమానులు సైతం ఆందోళనలకు గురువుతున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. మరి నిర్వాహకులు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.