విధాత: ‘కల్కి 2898 ఏడీ’ సిక్వెల్ నుంచి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకుణే తప్పుకుంది. ఆమె స్థానంలో మరో హీరోయిన్ ను ఎంపిక చేయనున్నట్లుగా చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ‘కల్కి 2898ఏడీ సీక్వెల్‌లో దీపికా పదుకోణే నటించడం లేదని అధికారికంగా ప్రకటిస్తున్నాం. చాలా విషయాల్లో పరిశీలించిన తర్వాత తమ భాగస్వామ్యం నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నాం. పార్ట్ 1 సినిమా చేయడానికి చాలా దూరం ప్రయాణించినప్పటికీ, మా మధ్య భాగస్వామ్య సరిగా కుదరలేదు. కల్కి వంటి భారీ చిత్రానికి కమిట్మెంట్ చాలా అవసరం. దీపికా భవిష్యత్తులో మరెన్నో సినిమాలు చేయాలని మేము విషెష్ తెలియజేస్తున్నాం. గొప్ప టీంతో కల్కి 2 త్వరలోనే మీ ముందుకు వస్తుంది.’ అంటూ రాసుకొచ్చింది.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మైథాలాజికల్ మూవీగా తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ గతేడాది విడుదలై భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. ఎన్నో అవార్డులను, ప్రశంసలను సొంతం చేసుకుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ మరోమూవీ కల్కీ వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ సినిమాకు సీక్వెల్ ఉండబోతుందని మేకర్స్ మొదటి భాగంలోనే వెల్లడించారు. ‘కల్కి 2898 ఏడీ’ లో ప్రభాస్ తో పాటు బాలీవుడ్ సెలబ్రెటీస్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే కీలక పాత్రల్లో నటించారు. దిశా పటానీ, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ వంటి స్టార్లు కూడా కీలక పాత్రల్లో మెరిశారు. ఇందులో అమితాబ్ అశ్వత్థామగా, దీపిక సుమతి అనే గర్బిణి అనే పాత్రలో దీపిక అద్భుతంగా నటించారు. సినిమా క్లైమాక్స్‌లో హీరో ప్రభాస్ కథలో కీలక పాత్రధారి దీపికను రక్షించి తీసుకెళ్లడంతో తొలి భాగం సినిమా ముగిసింది.
దీపికకు పుట్టబోయే బిడ్డ భవిష్యత్తులో అంధకారాన్ని జయించి ప్రజలకు వెలుగుని ఇచ్చే “కల్కి” అవతారం అనే సంకేతం నేపథ్యంలో సిక్వెల్ ఆమె పాత్ర కీలకంగా ఉండబోతుందన్న సిగ్నల్ ఇచ్చారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా దీపికా పదుకుణే కల్కీ సిక్వెల్ నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో ఎవరిని ఎంపిక చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. కాగా ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ నుంచి తప్పించబడిన దీపికాకు..తాజాగా ప్రభాస్ ‘కల్కి’ సీక్వెల్‌లోనూ అదే పరిస్థితి ఎదురవ్వడం చర్చనీయాంశమైంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్ కాంబినేషనల్ షూటింగ్ జరుపుకుంటున్న స్పిరిట్ సినిమా కోసం దీపికను సంప్రదించారు. ఆమె పెట్టిన కండీషన్స్ నచ్చక ఆమెను వదులుకున్నారు. ఆ సమయంలో కొన్ని రోజుల పాటు దీపిక వర్సెస్ సందీప్ రెడ్డి వంగ మధ్య ట్విట్ వార్ నడిచిన విషయం తెలిసిందే.