కోచి (కేరళ): Lakshmi Menon Controversy | తమిళం, మలయాళ సినీ రంగంలో పలు హిట్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న నటి లక్ష్మి మీనన్ పేరు ఇప్పుడు ఒక సంచలన ఘటనలో ప్రస్తావనకు వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా సినిమాల నుండి దూరంగా ఉన్న ఈ నటి, ఇప్పుడు కోచిలో జరిగిన బార్ ఘర్షణ, అపహరణ, దాడి కేసులో ప్రధాన అనుమానితురాలిగా నిలిచింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆశ్చర్యానికి గురవ్వడమే కాకుండా, కేరళలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.
అర్ధరాత్రి బార్లో ఘర్షణ
ఆగస్టు 24న అర్ధరాత్రి 11 నుంచి 12 గంటల మధ్యలో కోచి బెనర్జీ రోడ్‌లోని ఒక లగ్జరీ బార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. లక్ష్మి మీనన్ తన స్నేహితులు మిథున్, అనీస్, సోనామోల్‌తో కలిసి అక్కడికి వెళ్లారు. అదే సమయంలో అక్కడ ఉన్న ఐటీ ఉద్యోగుల బృందంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వాదన కొంతసేపటికి ఘర్షణగా మారింది.
ఐటీ ఉద్యోగి ఫిర్యాదు
ఘర్షణ అనంతరం, ఐటీ కంపెనీలో పనిచేస్తున్న అలియర్షా సలీం (27) వాహనాన్ని నార్త్ బ్రిడ్జ్ దగ్గర అడ్డగించి, కారులోనుంచి బయటకు లాగారని, మరో వాహనంలోకి తోసేసారని ఆయన ఫిర్యాదు చేశాడు. అక్కడే కాకుండా వాహనంలోపలే భౌతిక దాడి చేసి, తరువాత రోడ్డు మీద వదిలేశారని ఆరోపించాడు.
ఈ సంఘటనపై మరో ఐటీ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎర్నాకుం నార్త్ పోలీస్‌స్టేషన్ లో కేసు నమోదు అయింది.
పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టి ముగ్గురిని – మిథున్, అనీస్, సోనామోల్ లనుఅరెస్టు చేశారు. కాగా లక్ష్మి మీనన్ పై కూడా ఆరోపణలు రావడంతో ఆమెను కూడా విచారణకు పిలవాలని భావించారు. కానీ ప్రస్తుతం ఆమె పరారీ ఉన్నట్లు తెలుస్తోంది.
కోచి సిటీ పోలీస్ కమిషనర్ పుట్ట విపులాదిత్య మాట్లాడుతూ, “ఘటనలో ఒక మహిళ పాత్ర స్పష్టంగా ఉందని వీడియో సాక్ష్యాలు చెబుతున్నాయి. ఆమె ప్రస్తుతం పరారీలో ఉంది. వెతుకులాట కొనసాగుతోంది” అని తెలిపారు. అయితే ఇంకా లక్ష్మి మీనన్ పేరు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు కాలేదు, కానీ ఆమెపై అనుమానాలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు.
వీడియో క్లిప్స్ & ఆధారాలు
స్థానిక మలయాళ టీవీ చానెల్స్‌లో ప్రసారమైన వీడియో క్లిప్స్‌లో లక్ష్మి మీనన్ కనిపిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఇందులో ఘర్షణ సమయంలో ఆమె అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోలు కేసులో కీలక ఆధారాలుగా మారాయి.
ఇక మరోవైపు సోనామోల్ అనే వ్యక్తి, బాధితుడే తమను బెదిరించాడని, తమపై దాడి చేశారని వ్యతిరేక ఫిర్యాదు కూడా చేసాడు. ప్రస్తుతం పోలీసులు ఇరువురి ఫిర్యాదులను పరిశీలిస్తూ వాస్తవం ఏంటో తేల్చడానికి ప్రయత్నిస్తున్నారు.
కాగా, 2011లో రాఘవింటే స్వంతం రజియా అనే మలయాళ చిత్రంతో నటిగా పరిచయమై, 2012లో తమిళంలో సుందరపాండియన్తో హీరోయిన్‌గా గుర్తింపు పొందిన లక్ష్మి మీనన్, కొన్నేళ్లుగా సినిమాలకు దూరమైపోయారు. తెలుగు ప్రేక్షకులకు కూడా విశాల్ ఇంద్రుడు సినిమాతో లక్ష్మి మీనన్ పరిచయమే. ఇప్పుడు ఇలా ఒక నేర సంఘటనలో తన పేరు ఒక్కసారిగా వెలుగులోకి రావడం అభిమానులకు తీవ్ర షాక్ ఇచ్చింది.
ఆమె పోలీసుల విచారణకు హాజరుకాకుండా అదృశ్యమవ్వడంతో విషయం మరింత సంక్లిష్టంగా మారింది. సోషల్ మీడియాలో “లక్ష్మి మీనన్ ఎక్కడ?” అనే చర్చలు అభిమానులు, సినీ వర్గాలలో జోరుగా సాగుతున్నాయి.
దర్యాప్తు ముమ్మరం
- పోలీసులు వీడియో క్లిప్స్, సీసీటీవీ ఫుటేజ్, సాక్షుల వాంగ్మూలాలు సేకరిస్తున్నారు.
- అరెస్టయిన ముగ్గురిని విచారించి ఘటన వెనుక కారణాలను వెలికితీస్తున్నారు.
- దాడి, అపహరణ, దుర్వినియోగం తదితర నేరాలు రుజువైతే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.