Site icon vidhaatha

Mahavathar | వెండితెరపై యానిమేషన్‌ రూపంలో దశావతారాల గర్జన.. ఏడు సినిమాలకు షెడ్యూల్‌

Mahavathar | సినీరంగంలోనే కనీవినీ ఎరుగని రీతిలో భారీ యానిమేషన్‌ ప్రాజెక్టుకు హొంబలే, క్లీమ్‌ ప్రొడక్షన్స్‌ సిద్ధమయ్యాయి. దశావతరాల కథాంశాలతో వరుసగా ఏడు సినిమాలు నిర్మించనున్నాయి. ఈ మేరకు రెండు దిగ్గజ సినీ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. దాదాపు దశాబ్దంపాటు సాగే ఈ చిత్రాల పరంపర.. మహావతార్‌ నర్సింహతో 2025లో మొదలై.. 2037లో విడుదలయ్యే కల్కి పార్ట్‌2తో ముగియనుంది. మహావతార్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ పేరిట ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. తొలి చిత్రం మహావతార్‌ నర్సింహ విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో దర్శకుడు అశ్వినికుమార్‌ మాట్లాడుతూ.. భారతదేశ వారసత్వాన్ని వెండితెరపైకి తీసుకురానున్నామని తెలిపారు. అదికూడా మునుపెన్నడూ చూడని స్థాయిలో ఉంటుందన్నారు. ‘మహావతార్ యూనివర్స్‌ దశావతారం ద్వారా అతీంద్రియ అనుభవం ప్రారంభమవుతుంది… ఇప్పుడు భారత్ గర్జిస్తుంది’ అని ఆయన చెప్పారు.

చిత్రాలు.. విడుదలయ్యే సంవత్సరాలు
మహావతార్‌ నర్సింహ (2025)
మహావతార్‌ పరశురాం (2027)
మహావతార్‌ రఘునందన్‌ (2029)
మహావతార్‌ ద్వారకాదీశ్‌ (2031)
మహావతార్‌ గోకులనంద (2033)
మహావతార్‌ కల్కి పార్ట్‌ 1 (2035)
మహావతార్‌ కల్కి పార్ట్‌ 2 (2037)

‘అవకాశాలు అంతులేనివి. మన కథలు తెరపై సజీవంగా గర్జించబోతున్నాయి. అది చూడాలని నేను ఉత్సాహంతో ఉన్నాను. ఒక అద్భుతమైన సినిమాటిక్‌ ప్రయాణం కోసం సిద్ధంగా ఉండండి..’ అని నిర్మాత శిల్పా ధవన్‌ చెప్పారు. ఇది సినిమాకంటే ఎక్కువ అని, భారత ఆధ్యాత్మిక వారసత్వానికి తామిచ్చే వితరణ అని హోంబలే సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. కాలం, సరిహద్దులను దాటి సాగే కథలు చెప్పడంపై తమకు నమ్మకం ఉందని తెలిపారు. హోంబలే సమర్పణలో వస్తున్న మహావతార్‌ నర్సింహ చిత్రానికి క్లీం ప్రొడక్షన్స్‌ కింద శిల్పా ధవన్‌, కుశాల్‌ దేశాయి, చైతన్య దేశాయి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అశ్వినికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 2025 జూలై 25న మహావతార్‌ ఐదు భారతీయ భాషల్లో త్రీడీలో విడుదల కానున్నది.

 

 

Exit mobile version