విధాత : ఇటీవలే థియేటర్లలో విడుదలైన రెండు ప్రముఖ చిత్రాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. ధనుష్,నిత్యా మేనన్ తో జంటగా నటించిన ‘ఇడ్లీ కొట్టు’ సినిమా అక్టోబరు 29వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ పోస్టర్ విడుదలతో ప్రకటించింది. ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన ఉద్యోగాన్ని వదిలి.. తండ్రి వారసత్వంగా ఇడ్లీ కొట్టు నడిపే సాధారణ వ్యక్తి పాత్రలో ధనుష్ కనిపించారు. అయితే ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మరోపక్క చిన్న చిత్రంగా విడుదలై రికార్డులు తిరగరాసిన ‘కొత్తలోక: చాప్టర్ 1’ సినిమా కూడా ఓటీటీ రిలీజ్ డేప్ ఫిక్స్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది. అక్టోబర్ 31 నుంచి జియో హాట్‌స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ సంస్థ తెలిపింది. తెలుగు, మలయాళం, తమిళ, హిందీతో పాటు బెంగాళీ, మరాఠీలలోనూ ఇది స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ విడుదల చేసింది. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కల్యాణి ప్రియదర్శన్, నస్లేన్ కీలక పాత్రల్లో నటించారు.
