విశ్వంభర (Vishwambhara)– అప్పుడెప్పుడో అంజి(Anji) తర్వాత మళ్లీ చిరంజీవిని పురాణేతిహాసాల నేపథ్యంలో కథానాయకుడిగా చూపించే ప్రయత్నం. అప్పుడు గ్రాఫిక్స్‌లో ఇప్పుడున్నంత సాంకేతికత లేకపోయినా, దర్శకుడు కోడి రామకృష్ణ దాన్ని తీసిన తీరు అమోఘం. సినిమా పెద్దగా ఆడకపోయినా, పేరు మాత్రం బాగానే వచ్చింది. ప్రస్తుతం గ్రాఫిక్స్ యుగం. రాజమౌళి, నాగ్అశ్విన్, సుకుమార్, శంకర్ లాంటి సాంకేతిక జ్ఞానం ఉన్న దర్శకులు సినిమాల్లో సిజి(Computer Graphics) ద్వారా కొత్త లోకాలను చూపిస్తున్నారు. అదే కోవకు చెందింది ఈ విశ్వంభర.
బింబిసార(Bimbisara)తో ఒక్కసారిగా వెలిగిపోయిన ఈ దర్శకుడు మల్లిడి వశిష్ట(Mallidi Vasishta) తన రెండో సినిమాకే మెగాస్టార్‌ను ఒప్పించగలిగాడంటే కథ ఎంతో ఘనంగా ఉండేఉంటుంది. దాన్ని తెరమీద అద్భుతంగా ఆవిష్కరించగలిగే గ్రాఫిక్స్ అవసరం. అదే సినిమాకు పెద్ద చిక్కు తెచ్చిపెట్టింది. టీజర్ విడుదల చేసినప్పుడు పేలవంగా(Dull graphics) ఉన్న గ్రాఫిక్ వర్క్‌ను చూసి అందరూ పెదవి విరిచారు. ముఖ్యంగా చిరంజీవి అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగా విరుచుకుపడ్డారు. దాంతో నష్టనివారణ చర్యలు చేపట్టడానికి నిర్మాణ సంస్థ నడుం బిగించింది. చిరంజీవి కూడా ఈ విషయంలో సీరియస్‌గా ఉండటం, దర్శకుడికి గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది. ఈ నేపథ్యంలో హుటాహుటిన గ్రాఫిక్స్ కంపెనీని తీసేసిన దర్శకుడు ఈసారి పెద్ద ఎత్తున ఆలోచించాడు. ఆ విధంగా ఆలోచించాల్సిందిగా, బడ్జెట్‌పై ఎటువంటి పరిమితులు లేవని నిర్మాతలు యువీ క్రియేషన్స్(UV Creations) ఆయనకు హామీ ఇవ్వడంతో ఏకంగా అవతార్ (Avatar)సినిమాకు గ్రాఫిక్స్ చేసిన కంపెనీని సంప్రదించారు. వెటా ఎఫెక్స్( Wētā FX) అనే కంపెనీ అవతార్‌కు పనిచేసింది. దాన్నే సంప్రదించినట్లు విశ్వసనీయ సమాచారం.
ఈ నేపథ్యంలోనే చిరంజీవి సలహాతో ‘కల్కి 2898 ఏడీ’(Kalki 2898AD) చిత్రం ద్వారా గ్రాఫ్క్స్లో విశ్వరూపం చూపించిన దర్శకుడు నాగ్అశ్విన్ (Nag Ashwin) సంప్రదించాడట. ఈ విషయమై చిరంజీవి నాగ్అశ్విన్తోనూ, నిర్మాత, ఆయన మామ అశ్వనీదత్‌తోనూ స్వయంగా మాట్లాడగా వారు సంతోషంగా అంగీకరించినట్లు తెలిసింది. దాంతో నాగ్అశ్విన్ విశ్వంభరలోకి ప్రవేశించి తన సినిమాకు పనిచేసిన సిజీ టీమ్‌ను రప్పించి, వెటా ఎఫెక్స్ సలహాలతో గ్రాఫిక్స్‌ను తిరగి అద్భుతంగా రూపొందిస్తున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం శరవేగంగా సిజివర్క్ జరుపుకుంటున్న విశ్వంభర షూటింగ్లో ఒక్క పాట మాత్రం పెండింగ్ ఉన్నట్లు, అది కూడా త్వరలోనే కంప్లీట్ కానున్నట్లు చిత్రబృందం తెలిపింది. అందరూ ఓ మాటనుకుని, చివరికి ఆగస్టు 22, 2025 మెగాస్టార్ జన్మదినాన విడుదలకు ముస్తాబవుతోంది. చిరంజీవి సరసన త్రిష(Trisha Krishnan) హీరోయిన్గా, కీరవాణి(MM Keeravani) సంగీత దర్శకుడిగా, మీనాక్షి చౌదరి, అషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రమోద్, వంశీ, విక్రమ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.