విధాత : మెగాస్టార్ చిరంజీవి, నయనతారలు హీరోహీరోయిన్లుగా, దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం (పండగకు వస్తున్నారు) నుంచి మేకర్స్ మీసాల పిల్ల పాట ఫుల్ సాంగ్ ను మంగళవారం విడుదల చేశారు. దసరా రోజున ఫస్ట్ సాంగ్ ప్రోమో ను రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఎప్పుడెప్పుడు ఫుల్ సాంగ్ విందామా అన్న అభిమానులను ఇప్పుడు ఫుల్ సాంగ్ వినే ఛాన్స్ వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరీలియో సంగీత దర్శకత్వంలో ఈసాంగ్ ను ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ పాడారు. భార్యభర్తల మధ్య తగవు నేపధ్యంలో సాగిన ‘ఏ మీసాల పిల్ల.. నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్లా అంటూ.. నీ వేషాలు చాలులే..నువ్వు కాక పడితే కరిగేటంత సీనే లేదులే అంటూ వినసొంపుగా సాగింది. ఈ పాటలో చిరు వింటేజ్ లుక్కుతో తనదైన డ్యాన్స్ స్టెప్పులతో పాటు తన కామెడీ మార్క్ నటనతో అలరించారు. అభిమానుల్లో జోష్ నింపేలా సాగిన ఈ పాట మూవీపై అంచనాలను మరింత పెంచేసింది.
‘మన శంకర వర ప్రసాద్‌గారు’ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2026 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకులకు ముందుకు రానుంది. వీటీవీ గణేశ్, కేథరిన్ థ్రెసా, హర్షవర్దన్, రేవంత్ భీమల (బుల్లిరాజు) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దసరా ఫేం షైన్ టామ్ చాకో మెయిన్ విలన్‌గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల-విష్ణు ప్రసాద్ హోం బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.