వామ్మో..అనిల్ రావిపూడి ప్రమోషన్ మొదలెట్టేశాడు!

దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రం 'మన శంకర్ వరప్రసాద్ గారు వస్తున్నారు' ప్రమోషన్లను వినూత్నంగా మొదలుపెట్టారు. మీసాల పిల్ల సాంగ్ ప్రోమోతో పాటు 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో నటించిన బుల్లిరాజుతో ప్రమోషన్ వీడియో క్లిప్‌ను విడుదల చేశారు.

విధాత : దర్శకుడు అనిల్ రావిపూడి తన సినిమాలకు పెట్టే టైటిల్స్ తో పాటు ప్రేక్షకులను ఆకర్షించేందుకు చేసే ప్రమోషన్ కూడా సినీ ఇండస్ట్రీలోనే వినూత్నంగా ఉండేలా ప్లాన్ చేస్తుంటాడు. వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు వినూత్న ప్రమోషన్స్ తో ఆడియన్స్ ఆకట్టుకుని అనిల్ బాక్సాఫీస్ హిట్ కొట్టాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా రూపొందిస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు వస్తున్నారు సినిమా సైతం వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతుండగానే…మీసాల పిల్ల సాంగ్ ప్రోమోతో సినిమా ప్రమోషన్ ఆరంభించాడు. ఆ పాట ప్రోమోతో ఫుల్ సాంగ్ ఎప్పడొస్తుందంటూ మెగా ఫ్యాన్స్ ఎదురుచూసేలా చేశాడు.

ఇప్పుడు ఫుల్ సాంగ్ కు సంబంధించి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ కొడుకు బుల్లిరాజు పాత్రలో అలరించిన బాల నటుడు మాస్టర్ భీమల రేవంత్ తో ప్రమోషన్ వీడియో క్లిప్ వదిలాడు. సంగీత దర్శకుడు భీమ్ సిసిరోలియో మీసాల పిల్ల సాంగ్ కంపోజింగ్ లో ఉండగా…మధ్యలో బుల్లి రాజు వచ్చి ఫుల్ సాంగ్ ఎప్పుడంటూ ఫ్యాన్స్ ఫోన్లతో చంపేస్తున్నారంటూ చెబుతాడు. ఫుల్ సాంగ్ ఎప్పుడో వెళ్లి డైరక్టర్ అనిల్ రావిపూడిని అడగమని భీమ్ చెబుతాడు. బుల్లి రాజు వెంటనే అనిల్ రావిపూడి వద్దకు వెళ్లి తన అల్లరి చేష్టలతో మీసాల పిల్ల సాంగ్ ఎప్పుడంటూ ప్రశ్నిస్తాడు. వీరిద్దరి మధ్య సాగే హాస్య సంభాషణ, సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. మీసాల పిల్ల సాంగ్ లో చిరంజీవి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తే..ఫుల్ సాంగ్ ఎప్పుడో నీకే తెలిసిపోతుందంటూ అనిల్ అతడిని పంపించేస్తాడు. దీంతో బుల్లి రాజు సాంగ్ లో చిరు డ్యాన్స్ స్టెప్పులను ప్రాక్టీస్ చేస్తుండగా వీడియో క్లిప్ ముగుస్తుంది.