Megastar Chiranjeevi meets Hyderabad Police Commissioner VC Sajjanar
విధాత, హైదరాబాద్ సిటీ బ్యూరో:
Chiranjeevi – Sajjanar | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ను (VC Sajjanar) మర్యాదపూర్వకంగా కలిశారు. తాజాగా సజ్జనార్ హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో చిరంజీవి ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది. ఈ సందర్భంగా ఆయన పెద్ద కుమార్తె సుస్మిత కూడా తోడుగా ఉన్నారు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటూ, స్నేహపూర్వకంగా ముచ్చటించారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సజ్జనార్ గతంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్నప్పుడు, చిరంజీవితో కలిసి పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో ప్లాస్మా దానం ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇద్దరూ కలిసి కృషి చేశారు. ఇప్పుడు నగర కొత్వాల్‌గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా, చిరు స్వయంగా వెళ్లి అభినందించడం అభిమానులను ఆకట్టుకుంటోంది.
సజ్జనార్ గతంలో ఆర్టీసీ ఎండీగా కూడా విజయవంతమైన సేవలు అందించారు. ఉద్యోగుల సంక్షేమం, రవాణా సదుపాయాల విస్తరణలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే నగర శాంతిభద్రతలు, ట్రాఫిక్ సురక్ష, మాదకద్రవ్యాల నిర్మూలన వంటి అంశాలపై ఆయన చర్యలు ప్రారంభించారు.
ఇక చిరంజీవి విషయానికొస్తే, ప్రస్తుతం ఆయన సినిమాల షూటింగ్‌లలో బిజీగా ఉన్నారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా, విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
అలాగే, వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ అనే సోషియో ఫాంటసీ యాక్షన్ చిత్రం కూడా వేసవి విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాగా, బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ సినిమా, అలాగే శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో మరో హై ఓల్టేజ్ యాక్షన్ ప్రాజెక్ట్‌కు సన్నద్ధమవుతున్నారు.