విధాత, హైదరాబాద్ : లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ , ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలకు మధ్య ఎక్స్ వేదికగా మాటల యుద్దం సాగింది. గాంధీ కుటుంబానికి రూ.1000 కోట్లు ఇస్తానని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసేలా కేటీఆర్ ఎక్స్ లో రాహుల్ గాంధీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘హలో రాహుల్‌గాంధీ.. ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (AICC) ఏటీఎం అయిన తెలంగాణకు స్వాగతం’ అంటూ కేటీఆర్ వెల్‌కమ్ చెప్పారు. ‘మీరిప్పుడు సీఎం దగ్గర రూ.1000 కోట్లు వసూలు చేసుకోవడానికి వచ్చారా..?’ అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. ‘ పనిలోపనిగా మీరు 100 రోజుల్లో అమలుచేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీలు, 420 ఇతర వాగ్ధానాల పురోగతిని సమీక్షించడంపై కూడా కొంచెం శ్రద్ధ పెట్టండి’ అని సూచించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా జరిగే ఎన్నికలకు డబ్బు మూటలు పంపే ఏటీఎంలా మారిందని ఈ సందర్బంగా కేటీఆర్ మరోసారి విమర్శలు సంధించారు.
నోరు జాగ్రత్త కేటీఆర్ : బల్మూరి, చామల కౌంటర్
రాహుల్ గాంధీ కేరళ, తమిళనాడు ఎన్నికలలో కాంగ్రెస్ ఖర్చుల కోసం సీఎం రేవంత్ రెడ్డి నుంచి రూ 1000కోట్ల తీసుకెళ్లేందుకే తెలంగాణకు వచ్చాడని, తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంగా మార్చారని కేటీఆర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ ల విమర్శలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలు కౌంటర్ వేశారు. రాహుల్ గాంధీది త్యాగాల కుటుంబం…నీలా రాజభోగాల కుటుంబం కాదు అని, దేశం కోసం వారి కుటుంబం ప్రాణాలనే లెక్క చేయదు…వారి స్థాయి అది అని బల్మూరి వెంకట్ తెలిపారు.
కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను ATM లా వాడుకున్నది నువ్వు నీ కుటుంబం అని, 2014లో కేవలం 25 కోట్ల ఆస్తి విలువ నుండి 2023 నాటికి BRS పార్టీ దేశంలో రిచెస్ట్ పార్టీలలో ఒకటిగా ఎలా మారింది? దోచుకున్న డబ్బులు కావా ఇవి? అని కేటీఆర్ ను బల్మూరి నిలదీశారు. లైంలైట్ లో ఉండడానికి నోటికి వచ్చింది అనేయడమే…పబ్లిసిటీ కోసం ఇంతకు దిగజారడం నీ స్థాయి అని విమర్శించారు. అందరు నీ మాదిరిగా, మీ కుటుంబం మాదిరిగా వసూల్ రాజాలు ఉండరని బల్మూరి స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని దోచుకున్నారని, నీ లెక్క అందరూ వసూలు రాజాలు ఉండరు అని బల్మూరి విమర్శించారు. అధికారానికి ముందు కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు ఎన్ని.. ఇప్పుడు మీ ఆస్తులు ఎన్నో ప్రజలకు తెలుసు అన్నారు. ఒక్క ఉపఎన్నిక రూ. 500 కోట్లు ఖర్చు పెట్టిన చెత్త చరిత్ర మీది అని మండిపడ్డారు. మా సీఎం రేవంత్ మాట్లాడిన మాటలను వక్రీకరించి కేటీఆర్ పిచ్చి ప్రచారం చేస్తున్నాడని, అవసరమైతే రాహుల్ గాంధీకి, పార్టీకి వెయ్యి కోట్లు ఇచ్చే శక్తి తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలకు ఉందని మాత్రమే మా సీఎం రేవంత్ అన్నారని బల్మూర్ వెంకట్ వివరణ ఇచ్చారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం రాహుల్ గాంధీ రూ.1000కోట్ల వసూలుకు తెలంగాణ వచ్చాడని బీఆర్ఎస్ మాటలు మాట్లాడటం సిగ్గుచేటు అని బల్మూరి విమర్శించారు.
పచ్చ కామెర్ల రోగి తీరులా కేటీఆర్ వ్యాఖ్యలు
పచ్చ కామెర్లు వచ్చిన వారికి లోకం అంతా పచ్చగా ఉన్నట్లుగా రాహుల్ గాంధీపైన, సీఎం రేవంత్ రెడ్డిపైన కేటీఆర్ ఆరోపణల వ్యవహారం ఉందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దోచుకున్నారు అని, మీ నాయన, నువ్వు దోచుకున్నట్లు ఎవరు సీఎం కూర్చీలో కూర్చున్నా దోచుకుంటారని కేటీఆర్ భావిస్తున్నారు అని ఎద్దేవా చేశారు. తెలంగాణకు రూ. 1000కోట్ల కోసం రాహుల్ గాంధీ వచ్చారంటూ, తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంగా మార్చాడని, ఆరు గ్యారంటీలు అమలు చేయించడం లేదని కేటీఆర్ చిల్లర విమర్శలు చేస్తున్నారని, బీఆర్ఎస్ చెప్పినట్లుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం అవే మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఇవి కూడా చదవండి :
Harish Shankar | ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ రీమేక్ కాదంటూ హరీష్ శంకర్ క్లారిటీ.. రూమర్లపై ఘాటైన సమాధానం
Gold Silver Price Fall | కుప్పకూలిన బంగారం, వెండి ధరలు
