Allu Arjun Praises Rishab Shetty | కాంతార మరో కొత్త రికార్డు..అల్లు అర్జున్ ప్రశంస

రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన 'కాంతార చాప్టర్ 1' రూ. 818 కోట్ల వసూళ్లతో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దీనిపై హీరో అల్లు అర్జున్ స్పందిస్తూ "కాంతార చూసి ఆశ్చర్యపోయాను ఇది వన్-మ్యాన్ షో" అంటూ రిషబ్‌ను అభినందించారు.

Allu arjun praises kantara chapter 1 hero rishab shetty as one man show

విధాత : రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘కాంతార చాప్టర్‌ 1’ బాక్సాఫీస్ రికార్డుల పరంపరలో మరో కొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఈ మూవీ ఇప్పటి వరకూ రూ.818 కోట్లు వసూళ్లు చేసినట్లు తాజాగా చిత్రబృందం వెల్లడించింది. దీంతో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘కాంతార చాప్టర్‌ 1’ రికార్డు నెలకొల్పింది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్లు సాధించిన రెండో డబ్బింగ్‌ సినిమాగా కూడా రికార్డు నెలకొల్పింది. ఆస్ట్రేలియాలో సైతం అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలువగా…తాజాగా ఈ సినిమా ఇంగ్లీష్ వర్షన్ ను విడుదల చేశారు.

దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులను అలరిస్తూ బాక్సాఫీసు రికార్డులతో దూసుకపోతున్న కాంతార చాప్టర్ 1 మూవీని ప్రశంసించిన వారి జాబితాలో తాజాగా అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్‌ కూడా చేరారు. ఇది వన్‌మ్యాన్‌ షో అంటూ ఎక్స్‌ వేదికగా చిత్ర బృందాన్ని అభినందిస్తూ పోస్ట్‌ పెట్టారు. ‘‘కాంతార చూసి ఆశ్చర్యపోయాను. రైటర్‌గా, దర్శకుడిగా, హీరోగా రిషబ్‌ అన్నింట్లోనూ తన బెస్ట్‌ ఇచ్చారు. సినిమాలో నటించిన రుక్మిని వసంత్, జయరామ్ సహా ప్రతి ఒక్కరూ వారి పాత్రలకు వందశాతం న్యాయం చేశారు. సాంకేతిక బృందం పనితీరు ప్రతి సన్నివేశంలోనూ కనిపించింది. ఇంత గొప్ప సినిమాను నిర్మించినందుకు హోంబలే ఫిల్మ్స్‌కు అభినందనలు’’ అని అల్లు అర్జున్‌ పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు రిషబ్‌ స్పందిస్తూ బన్నికి కృతజ్ఞతలు తెలిపారు .