HEMA| సినీ నటి హేమ బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. మే 20న బెంగళూరులో రేవ్ పార్టీ విషయం బయటికి రాగా,అందులో హేమ కూడా పాల్గొన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ సమయంలో హేమ వీడియో విడుదల చేస్తూ తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని.. ఫాంహౌస్ లో చిల్ అవుతున్నానంటూ పేర్కొంది. కానీ, బెంగళూరు పోలీసులు పార్టీలో ఆమె ఫోటోలు విడుదల చేయడంతో.. హేమ చేసినది ఫేక్ వీడియో అని అందరు భావించారు. ఆ తర్వాతి రోజు బిర్యానీ వండుతున్న వీడియో విడుదల చేసింది. కాని బెంగళూరు పోలీసులు తమ విచారణలో భాగంగా పార్టీకి హాజరైన అందరి రక్త నమూనాలు సేకరించి డ్రగ్స్ టెస్ట్ చేయించారు.
అందులో హేమకి పాజిటివ్ రావడంతో నోటీసులు పంపించారు. అయితే తాను అనారోగ్యం కారణంగా హాజరు కాలేనని మొదట తప్పించుకున్న తర్వాత ఆమెని అదుపులోకి తీసుకున్నారు. అయితే హేమ పలువురితో కలిసి ఈ రేవ్ పార్టీని ఏర్పాటు చేసిందని పోలీసులు తెలియజేయడంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) లోని పలువురు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ఆచితూచి వ్యవహరిస్తూ వచ్చారు. కాని తాజాగా హేమను మా నుంచి సస్పెండ్ చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం హేమ విషయంలో పోలీసులు బయటపెట్టిన ఆధారాల ప్రకారం యాక్షన్ ఉంటుందంటూ మంచు విష్ణు ట్వీట్ చేశాడు.
హేమ సభ్యత్వం రద్దుపై ఇప్పుడు పలువురి అభిప్రాయాలను సేకరించారు మంచు విష్ణు.. అధిక మంది హేమను సస్పెండ్ చేయడంపై పాజిటివ్‌గా స్పందించడతో ఆమెకు క్లీన్ చీట్ వచ్చేంత వరకు మా అసోసియేషన్‌లో హేమ సభ్యత్వం రద్దు చేయాలని మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిపై గురువారం మా అధ్యక్షుడు విష్ణు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.ఇక జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న హేమను సీసీబీ పోలీసులు బుధవారం తమ కస్టడీకి తీసుకున్నారు. సీసీబీ పోలీసులు హేమను అరెస్టు చేసిన రోజే ప్రాథమికంగా విచారించారు. మరింత సమాచారం కోసం ఆమెను కస్టడీకి తీసుకున్నారు.