ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి నేడు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌కు ముందు చిరంజీవిని పద్మభూషణ్, పద్మశ్రీలు కూడా వరించాయి. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్రప్రభుత్వం అయనకు పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పద్మ అవార్డుల ప్రదానం రెండు విడతలుగా జరిగింది. మొదటి విడతలో ఏప్రిల్ 22న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పద్మవిభూషణ్ అందుకోగా, నేడు చిరంజీవి, ప్రముఖ నటి, నాట్యకళాకారిణి వైజయంతీమాల బాలికి పురస్కారం ప్రదానం జరిగింది. వీరితో పాటు సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఎం. ఫాతిమా బీవీ, ముంబై సమాచార్ పత్రిక ఎండీ హార్ముస్జీ ఎన్.కామా పద్మభూషణ్ అవార్డులను తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి కుటుంబసభ్యులు, భార్య సురేఖ, కొడుకు, ప్రముఖ నటుడు రామ్‌చరణ్, కోడలు ఉపాసన, కూతురు సుస్మిత హాజరయ్యారు.
పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్న నేపథ్యంలో మెగాస్టార్‌కు దేశం నలుమూలల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
అవార్డు గ్రహీతలకు హోంమంత్రి విందు
కాగా, నేటి సాయంత్రం పద్మవిభూషణ్ పురస్కార గ్రహీతలకు హోంమంత్రి అమిత్ షా తన నివాసంలో ఘనంగా విందు ఏర్పాటు చేసారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుటుంబసభ్యులతో హాజరయ్యారు. మిగతా అవార్డు గ్రహీతలతో, ముఖ్య అతిథులతో ముచ్చటిస్తూ, చిరంజీవి చాలా ఉద్వేగంగా కనిపించారు.
#WATCH | Delhi: President Droupadi Murmu confers Padma Vibhushan to Konidela Chiranjeevi in the field of Art. pic.twitter.com/dh1ehQJz8m
— ANI (@ANI) May 9, 2024