విధాత, హైదరాబాద్ : తెలుగు సినీ రంగంతో పాటు భారతీయ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన శివ సినిమాను నవంబర్ 14, 2025న థియేటర్లలో గ్రాండ్ రీ-రిలీజ్ చేస్తున్నట్లుగా అక్కినేని నాగార్జున ప్రకటించారు. తన తండ్రి..దివంగత అక్కినేని నాగేశ్వర్ రావు పుట్టిన రోజు శనివారం రోజున ఆయన ఈ విషయాన్ని ఎక్స్ లో పోస్టు చేశారు. నా ప్రియమైన తండ్రి ఎఎన్నార్ పుట్టినరోజున.. భారతీయ సినిమాను కదిలించిన సినిమా మళ్ళీ థియేటర్లను కదిలించడానికి నవంబర్ 14, 2025న థియేటర్లలో గ్రాండ్ రీ-రిలీజ్ తో తిరిగి వస్తోందని ప్రకటించడానికి నేను సంతోషంగా ఉన్నానంటూ ఎక్స్ లో నాగార్జున పోస్టు చేశారు. పెద్ద స్క్రీన్‌లపై డాల్బీ అట్మాస్ సౌండ్‌తో కల్ట్ క్లాసిక్ శివ 4కే మూవీని చూసి ఆనందించండని నాగార్జున కోరారు. అన్నపూర్ణ స్టూడియోస్ 50వ వార్షికోత్సవం సందర్భంగా శివ మూవీని రీ-రిలీజ్ ప్లాన్ చేశారు.
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందించిన శివ సినిమా 1989లో విడుదలై తెలుగు సినీ రంగంలో కొత్త శకానికి బాటలు పరిచింది. అందుకే తెలుగు సినీ ప్రస్థానాన్ని శివ కు ముందు..తర్వాత అంటూ సినీ విశ్లేషకులు చెబుతుంటారు. నాగార్జున తన సినీ కేరియర్ లో 1990లో శివ సినిమాలో ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. అటువంటి వెరీ స్పెషల్ మూవీ శివ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రీరిలీజ్ కు సిద్దమవుతుంది.
అత్యంత అధునాతన ఏఐ ఇంజనీరింగ్ తో 4కే తో పాటు డాల్బీ అట్మాస్ సాంకేతికతో మోనో ట్రాక్‌ను మొత్తం సౌండ్ ట్రాక్‌ను మొదటిసారిగా తిరిగి తయారు చేశారు. దీంతో ప్రేక్షకులకు సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఒక కొత్త అనుభూతిని ఇస్తాయి. యాక్షన్ సీక్వెన్స్ లోని సౌండ్స్ వెండితెరపై మరింత శక్తివంతంగా వినిపిస్తాయి .సినిమా రీ రిలీజ్ పై ఇటీవల దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందిస్తూ ”చైన్ ఈజ్ బ్యాక్! ఈసారి డాల్బీ అట్మాస్‌లో నాగార్జున పంచ్ మరింత బిగ్గరగా వినిపిస్తుంది.. మీ దవడను కాపాడుకోండి!” అంటూ ట్వీట్ చేశారు. తాజాగా శివ రీరిలీజ్ డేట్ ను నాగార్జున అనౌన్ చేయడంపై రాంగోపాల్ వర్మ స్పందిస్తూ హే నాగార్జునా..ఇది పిల్లల సినిమా కాదు, కానీ పిల్లల దినోత్సవం రోజున తిరిగి రావడం వల్ల చాలా ముఖాలపై పిల్లల ఆనందం కనిపిస్తుందంటూ రీట్విట్ చేశారు.