పండుగల ద్వారా దేశంలో సామాజిక సమైక్యత నెలకొంటుందని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. దసరా మరునాడు ప్రతి ఏటా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గతంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆహార అలవాట్లను చాటిచెప్పడంతో పాటు తెలంగాణలోని రాజకీయ పార్టీల నాయకుల మధ్య ఐక్యత కోసం ఈ కార్యక్రమాన్ని దత్తాత్రేయ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడారు. సర్వోజన సుఖినోభవంతు అంటేనే అందరూ బాగుంటారని అన్నారు. బండారు దత్తాత్రేయ విజినరీ రోల్ పోషించారని ఆయన అన్నారు. అలాయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దత్తాత్రేయను ఆయన అభినందించారు. అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప విషయమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. వేషం, భాషలు వేరైనా మబనమంతా భారతీయులమన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనే సిద్దాంతంతో ఏకం అవుదామని ఆయన కోరారు. అలయ్ బలయ్ తో దసరా రెండు మూడు రోజులు జరుపుకున్నట్టుగా అనిపిస్తోందని తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.చెడుపై మంచికి సూచికగా దసరా జరుపుకొంటామని ఆయన అన్నారు. దత్తన్నను చూస్తే రాజకీయాలు మర్చిపోతామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. అన్ని పార్టీలకు దత్తాత్రేయ ఆత్మీయుడని ఆయన అన్నారరు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్మీ జనరల్ అజయ్ మిశ్రా మాట్లాడుతూ ఇండియన్ మిలిటరీ హిస్టరీలో ఆపరేషన్ సింధు కీలకమైన ఘట్టమని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ ప్లానింగ్ తో పాటు కచ్చితత్వంతో అమలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశా రు. ప్రజల రక్షణే ఆపరేషన్ సిందూర్ లక్ష్యమని ఆయన వివరించారు. ఇండియన్ మిలటరీ హిస్టరీలో ఆపరేషన్ సిందూర్ ఓ కీలక ఘట్టమని ఆయన అన్నారు. ఆర్మీ వెనుక మొత్తం దేశం నిలబడిందని ఆయన అన్నారు. ఇలాంటి సత్కారం తనకు తొలిసారి జరిగిందని ప్రముఖ సినీ నటులు నాగార్జున అన్నారు. ఇది తనకు కొత్తగా ఉందని చెప్పారు. 20 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని దత్తాత్రేయ నిర్వహిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. అన్ని పార్టీలకు చెందిన నాయకులు, మంత్రులు ఒకే వేదికపై రావడం అభినందనీయమని ఆయన అన్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న విజయలక్ష్మిని ఆయన అభినందించారు.
పురాణాల ప్రకారం శ్రీరామచంద్రుడు హనుమంతుడిని ఆలింగనం చేసుకున్నారని… అప్పటి నుంచి ఈ అలయ్ బలయ్ కార్యక్రమం నడుస్తోందని సినీ నటులు బ్రహ్మనందం అన్నారు. ఇలాంటి కార్యక్రమం ఏడాదికి ఒక్కసారి జరగడం తనకు ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. ప్రపంచంలో శాంతి కరువైన సమయంలో అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమని ఆయన అన్నారు. ఇంతమందిని ఒకే వేదికపైకి తీసుకువచ్చిన దత్తాత్రేయ, విజయలక్ష్మికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, ఎంఆర్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ, రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ కేంద్ర మంత్రి సుజానా చౌదరి, సినీ నటులు నాగార్జున, బ్రహ్మనందం, సీపీఐ మాజీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మాజీ మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, తెలంగాణ జన సమతి చీఫ్ ప్రొఫెసర్ కోదండరామ్ తదితరులు పాల్గొన్నారు.