డీఎంకే గూటికి చేరిన తమిళనాడు మాజీ సీఎం ఓపీఎస్‌

ఒకప్పుడు డీఎంకేకు బద్ధవిరోధిగా ఉన్న అన్నాడీఎంకే నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం.. తిరిగి అదే డీఎంకే గూటికి చేరారు. రాష్ట్రంలో డీఎంకేను ఎదుర్కొనగల పార్టీ అంటూ ఏమీ లేదని ప్రశంసలు కురిపించారు.

Panneerselvam joins DMK

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే బహిష్కృత నేత ఓ పన్నీర్‌సెల్వం శుక్రవారం (ఫిబ్రవరి 27, 2026) అధికార డీఎంకేలో చేరారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సమక్షంలో ఆయన డీఎంకే కండువా కప్పుకొన్నారు. పన్నీర్‌సెల్వం కుమారుడు రవీంద్రనాథ్‌ కుమార్‌ కూడా డీఎంకేలో చేరారు. ఓపీఎస్‌గా పిలిచే పన్నీర్‌సెల్వం.. ఒకప్పుడు అన్నాడీఎంకే దివంగత నేత జయలలితకు అత్యంత నమ్మకస్తుడు. జయలలిత ముఖ్యమంత్రి పదవిని వదలాల్సి వచ్చినప్పుడల్లా ఓపీఎస్‌నే సీఎం చేసేవారు. ఆ సమయంలో ఆయన తన జేబులో జయలలిత ఫొటోను నిత్యం ఉంచుకునేవారు. జయలలితను అమ్మ అంటూ సంబోధించేవారు. మూడేళ్ల క్రితం ఆయన అన్నాడీఎంకే నుంచి ఓపీఎస్‌ బహిష్కరణకు గురయ్యారు. అప్పటి నుంచి అదే పార్టీలో చేరేందుకు విఫలయత్నాలు చేసిన ఓపీఎస్‌.. చివరకు అన్నాడీఎంకే బద్ధ విరోధ పార్టీ అయిన డీఎంకే గూటికి చేరారు.

గతంలో పన్నీర్‌సెల్వం.. అన్నాడీఎంకే కోశాధికారిగా వ్యవహరించారు. పార్టీ కోఆర్డినేటర్‌గా కూడా విధులు నిర్వహించారు. డీఎంకే 2006లో అధికారంలోకి వచ్చిన సమయంలో కొంతకాలం తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు.

డీఎంకేలో చేరడం తనకు సంతోషంగా ఉన్నదని ఓపీఎస్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అన్నాడీఎంకే చీఫ్‌ ఎడప్పాడి కే పళనిస్వామి నియంత, అహంభావి అంటూ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే ఎన్నడూ అధికారంలోకి రాలేని పరిస్థితులను ఎడప్పాడి సృష్టించారని ఆరోపించారు. సీఎం స్టాలిన్‌ నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని చెప్పారు. ప్రజల అవసరాలను స్టాలిన్‌ అర్థం చేసుకున్నారని, ఎలాంటి వివక్ష చూపకుండా అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని కొనియాడారు. ఈ రోజు డీఎంకేను ఎదిరించే పార్టీ అంటూ లేదని అన్నారు. డీఎంకేలోకి రావడాన్ని ‘తన మాతృపార్టీలోకి’ వచ్చినట్టయిందని వ్యాఖ్యానించారు. 1972లో డీఎంకే నుంచి చీలిపోయిన ఒక వర్గం.. అన్నాడీఎంకేగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ చీలిక వర్గానికి ఎంజీ రామచంద్రన్‌ నాయకత్వం వహించారు. మూడు రోజుల వ్యవధిలోనే అన్నాడీఎంకేకు రెండు షాకులు ఎదురయ్యాయి. దాదాపు ఐదేళ్లు మౌనంగా ఉన్న అన్నాడీఎంకే మాజీ నాయకురాలు వీకే శశికళ.. అంతకు ముందు ఎడప్పాడి పళనిస్వామిపై తీవ్రస్థాయిలో దుమ్మెత్తిన విషయం తెలిసిందే. కొత్త రాజకీయ పార్టీ పెడతానని కూడా ప్రకటించారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే బహిష్కృత నేత పళనిస్వామి డీఎంకేలో చేరారు.

Latest News