విజయ్‌కు గంటగంటకో షాక్.. రేపటి ప్రమాణస్వీకారానికి గవర్నర్ బ్రేక్!
టీవీకే అధినేత విజయ్‌కు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్న వాదనను తమిళనాడు గవర్నర్ కార్యాలయం తిరస్కరించింది. టీవీకేకు ప్రస్తుతం 116 మంది ఎమ్మెల్యేల మద్దతే ఉందని సమాచారం. దీంతో రేపటి ప్రమాణస్వీకారం మళ్లీ నిలిచిపోయింది.
118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెబుతూ గవర్నర్‌కు లేఖ సమర్పించిన విజయ్.. అయితే మెజారిటీపై ఇంకా సందేహాలు కొనసాగుతున్నాయి
Twist over twist : Governor Not Convinced Over Vijay Majority, No Oath Ceremony Tomorrow
- ● టీవీకేకు ప్రస్తుతం 116 మంది ఎమ్మెల్యేల మద్దతే ఉన్నట్లు సమాచారం
- ● నిలిచిపోయిన రేపటి సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం
- ● TVK కు చేయిచ్చిన AMMK దినకరన్ – ఏఐఏడీఎంకేకు మద్దతు
- ● IUML, VCK నుంచి మద్దతు లేఖలు సమర్పించలేకపోయిన విజయ్ శిబిరం
విధాత భారత్ డెస్క్ | మే 8, 2026 | హైదరాబాద్:
No Vijay Oath Tomorrow | తమిళనాడు రాజకీయ థ్రిల్లర్‌లో మలుపుల మీద మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కాసేపటి క్రితం వరకు ముఖ్యమంత్రిగా విజయ్ రేపు ప్రమాణస్వీకారం చేస్తారన్న ప్రచారానికి ఇప్పుడు గవర్నర్ కార్యాలయం మరోసారి బ్రేక్ వేసింది. టీవీకే అధినేత విజయ్ 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పినా.. అందుకు సరైన ఆధారాలు చూపలేకపోయారని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి.
దీంతో రేపు ఉదయం 11 గంటలకు జరుగుతుందని ప్రచారం జరిగిన ప్రమాణస్వీకారం ప్రస్తుతం నిలిచిపోయినట్లైంది. తమిళనాడు గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ విజయ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఇంకా ఆహ్వానించలేదని సమాచారం. గవర్నర్ కార్యాలయ వర్గాల సమాచారం ప్రకారం, టీవీకేకు ప్రస్తుతం 116 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్నట్లు గవర్నర్ భావిస్తున్నారు. అంటే మెజారిటీకి అవసరమైన సంఖ్యకు ఇంకా ఇద్దరు తక్కువగా ఉన్నారు.
VCK, IUML లేఖలు లేకపోవడంతో గవర్నర్ సందేహాలు
టీవీకే చివరి నిమిషం వరకు వీసీకే, ఐయూఎంఎల్, AMMK మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నించినా పూర్తి విజయవంతం కాలేదని తెలుస్తోంది. ముఖ్యంగా వీసీకే మరియు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నుంచి అధికారిక మద్దతు లేఖలు విజయ్ సమర్పించలేకపోయారని సమాచారం.
ఇదే సమయంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(IUML) అధికారికంగా విడుదల చేసిన లేఖలో తాము టీవీకే కూటమిలో భాగం కాదని స్పష్టం చేసింది. మరోవైపు ఇంతకుముందు వరకు టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు ప్రచారం జరిగిన టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కళ్ మున్నేత్ర కళగం(AMMK) కూడా విజయ్‌కు మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేస్తూ, ఏఐఏడీఎంకేకు మద్దతు లేఖను గవర్నర్‌కు అందజేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పన్నీర్ సెళ్వంను ఆహ్వానించాల్సిందిగా దినకరన్ స్వయంగా గవర్నర్‌ను కలిసి మద్దతు లేఖను అందజేసారు.

లోక్ భవన్‌లో గవర్నర్ ఆర్వీ అర్లేకర్‌ను కలిసి ఏఐఏడీఎంకేకు మద్దతు లేఖ అందజేసిన AMMK అధినేత టిటివి దినకరన్
దీంతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు ప్రయత్నాలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల్లో 108 స్థానాలు గెలుచుకుని సంచలనం సృష్టించిన తమిళగ వెట్రి కళగం(TVK).. ఇప్పుడు మెజారిటీ కోసం దశాబ్దాల ద్రవిడ రాజకీయ సమీకరణాల్లో చిక్కుకుంది.
కాంగ్రెస్ మద్దతు ఉన్నా సరిపోని సంఖ్యలు
ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేతో విభేదించిన కాంగ్రెస్ ఇప్పటికే విజయ్‌కు ఐదు స్థానాల మద్దతు ఇచ్చింది. అయితే బీజేపీతో లేదా ఇతర మతతత్వ పార్టీలతో పొత్తు పెట్టుకోకూడదన్న షరతు పెట్టినట్లు తెలుస్తోంది. వామపక్ష పార్టీలు CPI, CPM బయట నుంచి మద్దతు ఇస్తామని ప్రకటించాయి. కానీ అవి కేబినెట్‌లో చేరబోవడం లేదని స్పష్టం చేశాయి. కాంగ్రెస్ మాత్రం రెండు మంత్రి పదవులు ఆశిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఇక తమిళ రాజకీయాల్లో డీఎంకే – ఏఐఏడీఎంకే మధ్య “అపవిత్ర కూటమి” ప్రచారం కూడా కొనసాగుతోంది. విజయ్ ఎదుగుదలతో రెండు ప్రధాన ద్రవిడ పార్టీల్లోనూ ఆందోళన పెరిగిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
బీజేపీ మాత్రం ఈ మొత్తం వ్యవహారంలో తమ ప్రమేయం లేదని చెబుతోంది. “విజయ్ మెజారిటీ నిరూపించుకుంటే గవర్నర్ రాజ్యాంగబద్ధంగా ఆహ్వానిస్తారు” అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారాయణ్ తిరుపతి పేర్కొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram