- 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి
- భూ నిర్వాసితులకు తొలి ప్రాధాన్యం అవసరం
- కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు జేఏసీ యత్నం
- ఆందోళనకు సిద్ధమవుతున్న రాజకీయ పక్షాలు
- శనివారం కాజీపేటలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా
- మార్చి 8న జేఏసీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
Kazipet Coach Factory | వరంగల్ జిల్లా ప్రజల చిరకాలం వాంఛ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న వేళ ఉద్యోగాల్లో స్థానికులకు తొలి ప్రాధాన్యం కల్పించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. దశాబ్దాల పోరాటం ఫలితంగా ఏర్పాటైన ఈ ఫ్యాక్టరీలో స్థానికులకు 80శాతం ఉద్యోగావకాశాలు కల్పించినపుడే సరైన సామాజిక న్యాయం చేసినట్టు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వెనుకబడిన గ్రామీణ ప్రాంతాలు కాజీపేట చుట్టూ ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీ కోసం దేవాదాయ భూములతోపాటు పలువురు రైతులు తమ భూమిని అప్పగించారు. దేవాదాయ భూముల్లో కౌలు రైతులుగా పనిచేసిన వారు తమ ఉపాధిని పణంగా పెట్టి ఈ ఫ్యాక్టరీకి భూములిచ్చేందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో భూ నిర్వాసితులకు ఈ ఫ్యాక్టరీలో ఉద్యోగావకాశం కల్పించాలని, స్థానిక యువతకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు.
తెలంగాణలో ప్రత్యేకించి వరంగల్ జిల్లా విప్లవోద్యమానికి పెట్టింది పేరు. ఉపాధి అవకాశాలు సన్నగిల్లిన క్రమంలో దశాబ్దాల క్రితం స్థానిక యువత అటువైపుగా పయనించిన నేపథ్యం కూడా ఉంది. ఈ కోణంలో ఆలోచించినా రానున్న రోజుల్లో నిరుద్యోగం స్థానిక యువత పాలిట శాపంగా మారకుండా కేంద్రం ఈ ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కాజీపేట, కడిపికొండ, మడికొండ, భట్టుపల్లి, అయోధ్యపురం, సోమిడి తదితర అనేక గ్రామాలు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడి యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నది.
దశాబ్దాల కల నెరవేరే వేళ
తొలి తెలంగాణ ఉద్యమం నుంచి ప్రారంభమైన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ డిమాండ్ తదుపరి 1980 దశకంలో ప్రభుత్వ ప్రతిపాదనల్లోకి చేరి అమలు దశలో అనేక అడ్డంకులు నెలకొన్నాయి. కాజీపేట ప్రాంతానికి మంజూరైన కోచ్ ఫ్యాక్టరీలు వివిధ ప్రభుత్వాల హయాంలలో ఇతర ప్రాంతాలకు తరలివెళ్ళి, ఇక్కడి ప్రాంతవాసుల ఆశలను నీరుగారుస్తూ వచ్చాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోచ్ ఫ్యాక్టరీ స్థానంలో కేవలం వాగన్ పిరియాడికల్ ఓవర్‌హాలింగ్ (POH) వర్క్‌షాప్ ఏర్పాటుగా మార్చింది. ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వరంలో శంకుస్థాపన జరుగడంతో మిశ్రమ స్పందన లభించింది. ఏదో ఒక ఫ్యాక్టరీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారనే అభిప్రాయం వ్యక్తమైన నేపథ్యంలో రాజకీయ పక్షాల నుంచి పెరిగిన ఒత్తిడికి కేంద్రం తలొగ్గి పీవోహెచ్‌ను కోచ్ నిర్మాణ ఫ్యాక్టరీగా మార్చారు. దీంతో స్థానికుల్లో ఆనందం వ్యక్తమైంది. ఫ్యాక్టరీ నిర్మాణ పనులు చివరి దశకు చేరిన నేపథ్యంలో స్థానికులకు ఉద్యోగావకాశం కల్పించే అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది.
తెరపైకి స్థానికులకు ఉద్యోగ డిమాండ్
కోచ్ ఫ్యాక్టరీ పూర్తి కావస్తున్న సందర్భంగా దీని కోసం పోరాడిన జేఏసీ, ఇతర సంస్థలు, రాజకీయ పార్టీలు ఒక్కరొక్కరుగా గొంతెత్తుతున్నారు. స్థానికులకు ఉద్యోగావకాశం కల్పించినపుడు సరైన న్యాయం జరుగుతోందంటున్నారు. అందుకోసం స్థానికులకే 80శాతం ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ డిమాండ్ న్యాయమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 10 నుంచి 15 వేల మందికి ఉపాధి లభిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ ఫ్యాక్టరీపై ఆశతో అనేక మంది ఇంజినీరింగ్, డిప్లామో, ఐటీఐ, ఏటీసీల్లో చదువులు పూర్తి చేసిన నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. ‘మన పిల్లలకు మన ఉద్యోగాలు’ అనే డిమాండ్‌తో ఇటీవల జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. దీనిపై అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ స్థానిక నాయకులు, వివిధ ప్రజాసంఘాలు, రైల్వే ఉద్యోగ,కార్మిక కుటుంబాలు ఇదే డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం, రైల్వే శాఖ సామాజిక న్యాయానికి కట్టుబడి స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే మరో ఆందోళన కొనసాగిస్తామంటూ స్పష్టం చేస్తున్నారు. ఈ సమస్యపై జేఏసీ ఇప్పటికే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. తాజాగా శుక్రవారం మరోసారి సమావేశమయ్యారు. ఈ సమస్య పై మార్చి 8వ తేదీన కోచ్ ఫ్యాక్టరీ వద్ద నిరసన దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. ఈ అంశం పై అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు నిరసనకు సిద్ధమవుతున్నాయి.
నేడు కాజీపేటలో బీఆర్ఎస్ ధర్నా:
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 80 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, కాజీపేటను రైల్వే డివిజన్ చేయాలని, రైల్వేలో వ్యాపార అవకాశాల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్లతో శనివారం కాజీపేటలో ధర్నా చేపట్టనున్నట్లు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ సమస్య పరిష్కారానికి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడుతామన్నారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఈ ధర్నాకు హాజరవుతారని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో ఆ తర్వాత బీఆర్ఎస్ పోరాటం ఫలితంగానే ఈ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగిందన్నారు. తమ ప్రభుత్వం 150 ఎకరాల భూమిని సేకరించి రైల్వేలకు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేసిందని గుర్తుచేశారు. తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చేలా జీ వో వచ్చేలా ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు.
స్థానికులకు ఉద్యోగం సామాజిక న్యాయం:
స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే పోరాటం ఎవరికీ వ్యతిరేకం కాదని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన కమిటీ కన్వీనర్ బండి దుర్గాప్రసాద్ అన్నారు. ఇది హక్కుల సాధన కోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో చేసే విజ్ఞప్తిగా గుర్తుచేశారు . స్థానికులకు ఉద్యోగావకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ మార్చి 8న కోచ్ ఫ్యాక్టరీ వద్ద నిరసన దీక్ష నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే పార్లమెంట్ సమావేశాల సమయంలో ఢిల్లీలో కార్యక్రమం చేపట్టాలనే నిర్ణయాలు ప్రజల్లో పెరుగుతున్న ఆవేదనకు ప్రతిబింబమని పేర్కొన్నారు. ఈ హెచ్చరికలను నిర్లక్ష్యం చేయడం సమంజసం కాదని, కేంద్రం స్పందించి స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా ప్రకటన చేయాలని కోరారు.
