SCR Special Trains | హైదరాబాద్ : వేసవి ప్రయాణికులను రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. బిలాస్‌పూర్ – యెలహంక రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రత్యేక రైళ్ల వివరాలను బుధవారం అధికారికంగా ప్రకటించింది.
కాజీపేట జంక్షన్ మీదుగా బిలాస్‌పూర్ – యెలహంక మీదుగా అప్ అండ్ డౌన్‌లో 10 ప్రత్యేక రైళ్ల సర్వీసులను నడిపించనున్నారు. జూన్ 3 నుంచి జులై 1వ తేదీ వరకు ఐదు సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు(08261).. ప్రతి బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరి గురువారం రాత్రి 7 గంటలకు గమ్యస్థానానికి చేరుకోనున్నాయి.
మరో ఐదు సర్వీసులు జూన్ 4 నుంచి జులై 2 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు(08262) ప్రతి గురువారం రాత్రి 9.30 గంటలకు బయల్దేరి శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు గమ్యస్థానానికి చేరుకోనున్నాయి.
ఈ ప్రత్యేక రైళ్లల్లో 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉండనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
ఈ స్టేషన్ల మీదుగా రాకపోకలు..
భాటాపారా, రాయ్‌పూర్, దుర్గ్, రాజ్‌నంద్‌గావ్, దొంగర్‌గర్హ్, గోండియా, వడ్సా, చందా ఫోర్ట్, బల్లార్షా, సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల, కాజీపేట, చర్లపల్లి, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, యాద్గిర్, కృష్ణా, రాయిచూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్, గుత్తి, అనంతపూర్, ధర్మవరం మీదుగా రాకపోకలు కొనసాగించనున్నాయి.