రికార్డుస్థాయిలో అత్యధికంగా 144.244 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసిన దక్షిణ మధ్య రైల్వే.. 

దక్షిణ మధ్య రైల్వే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025–26లో 144.244 మిలియన్ టన్నుల (ఎమ్.టిలు) సరుకు రవాణా సాధించడం ద్వారా అత్యుత్తమ పనితీరును నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా వారం రోజుల ముందుగానే ఈ మైలురాయిని చేరుకోగలిగింది.

  • By: TAAZ |    national |    Published on : Mar 25, 2026 7:53 PM IST
రికార్డుస్థాయిలో అత్యధికంగా 144.244 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసిన దక్షిణ మధ్య రైల్వే.. 

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

దక్షిణ మధ్య రైల్వే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025–26లో 144.244 మిలియన్ టన్నుల (ఎమ్.టిలు) సరుకు రవాణా సాధించడం ద్వారా అత్యుత్తమ పనితీరును నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా వారం రోజుల ముందుగానే ఈ మైలురాయిని చేరుకోగలిగింది. ఇది సరుకు రవాణా విభాగంలో దక్షిణ మధ్య రైల్వే ప్రదర్శించిన నిరంతర కృషిని, నిర్వహణ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుందని భావిస్తున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో నమోదైన అత్యుత్తమ లోడింగ్ అయిన 144.14 మిలియన్ టన్నులను సైతం ఈ ఆర్ధిక సంవత్సరంలో అధిగమించింది. జోన్ ప్రారంభమైనప్పటినుండి మునుపెన్నడూ లేనివిధంగా అత్యధిక సరుకు రవాణా లోడింగ్‌ను నమోదు చేయడం గమనార్హం.

దక్షిణ మధ్య రైల్వే ముఖ్యంగా తన పరిధిలోని సింగరేణి బొగ్గు గనులు, సిమెంట్ కర్మాగారాల నుండి బొగ్గు, సిమెంట్ రవాణా రంగంలో పటిష్టంగా ఉంది. దీనికితోడు జోన్‌లోని ప్రస్తుత సరుకు రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తూనే, ఈ విభాగంలో కొత్త సరుకులను సైతం రవాణా చేయడం వల్ల నూతన ఒరవడులకు శ్రీకారంచుట్టి ఎక్కువ మొత్తంలో సరుకు రవాణా చేసినట్లు చెబుతున్నారు.

రవాణా చేసిన సరుకు వివరాలు:
• రవాణా వ్యవస్థలో ప్రధాన వస్తువు అయిన బొగ్గు: 66.878 మిలియన్ టన్నులు
• సిమెంట్: 37.572 మిలియన్ టన్నులు
• ఇనుప ఖనిజం: 8.620 మిలియన్ టన్నులు
• ఎరువులు: 8.038 మిలియన్ టన్నులు
• ఉక్కు కర్మాగారాలకు ముడి పదార్థాలు: 4.810 మిలియన్ టన్నులు
• ఆహార ధాన్యాలు: 6.225 మిలియన్ టన్నులు
• కంటైనర్లు: 2.561 మిలియన్ టన్నులు
• పెట్రోలియం ఉత్పత్తులు(పెట్రోలియం ఆయిల్) -1.223 మిలియన్ టన్నులు
• ఇతర వస్తువులు- 8.349 మిలియన్ టన్నులు: మొత్తంగా 144.244 మిలియన్ టన్నులు

సమిష్టి కృషి సమన్వయం:

దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది అసాధారణ సమిష్టి కృషితోపాటు అన్ని విభాగాల మధ్య సమర్థవంతమైన సమన్వయం ఫలితంగా ఈ రికార్డు స్థాయి పనితీరు సాధ్యమైంది. సరుకు రవాణా వినియోగదారులను ఆకర్షించడానికి మౌలిక సదుపాయాల మెరుగుదల, టెర్మినల్ లలో పని వాతావరణం, గూడ్స్ షెడ్ల అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినందున ఈ ఫలితాలు సాధించినట్లు భావిస్తున్నారు. దీనికి తోడు వినియోగదారుల అవసరాలను సమాయనుసారం పరిష్కరించేందుకు అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. సాంప్రదాయ సరుకులతో పాటు ఇతర సరుకులను కూడా గుర్తించి, పోర్ట్ లోడింగ్‌పై దృష్టి సారించడంలో జోన్ చేసిన నిరంతర ప్రయత్నాలు రికార్డు స్థాయి సరుకు రవాణాను సాధించడానికి దోహదపడ్డాయి.

అధికారులు, సిబ్బందికి అభినందనలు:

సరుకు రవాణా రంగంలో స్థిరస్థాయిగా నిలిచిపోయే మైలురాయిని సాధించడంలో ఆపరేషన్స్, కమర్షియల్ బృందాల అంకితభావాన్ని ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ప్రశంసించారు. ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నల్స్ , టెలికమ్యూనికేషన్ వంటి విభాగాల సమర్థవంతమైన సమన్వయం రికార్డు స్థాయి సరుకు రవాణా లోడింగ్ సాధనలో కీలక పాత్ర పోషించిందని ఆయన అభినందించారు. అధికారులు, సిబ్బంది చూపిన నిబద్ధత, సమిష్టి కృషి సమన్వయపూర్వక దృక్పథాన్ని ఆయన ప్రత్యేకంగా గుర్తించారు. భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ, సరుకు రవాణా విభాగంలో మరింత వృద్ధి సాధించేందుకు కృషి చేయాలని ఆయన బృందాన్ని ప్రోత్సహించారు.