TGSRTC | సంక్రాంతికి 1200 బ‌స్సులు.. 9 నుంచి 15 వ‌ర‌కు అందుబాటులో

TGSRTC | తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సంద‌డి నెల‌కొంది. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఉండే ప్ర‌జ‌లు త‌మ సొంతూర్ల‌కు వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

  • By: raj |    telangana |    Published on : Jan 06, 2026 7:49 AM IST
TGSRTC | సంక్రాంతికి 1200 బ‌స్సులు.. 9 నుంచి 15 వ‌ర‌కు అందుబాటులో

TGSRTC | హైద‌రాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సంద‌డి నెల‌కొంది. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఉండే ప్ర‌జ‌లు త‌మ సొంతూర్ల‌కు వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ న‌గ‌రంలో ప‌లువురు షాపింగ్ కూడా చేసేసుకున్నారు. ఇక మిగిలింది సొంతూర్ల‌కు వెళ్ల‌డ‌మే. ఇక సొంతూర్ల‌కు వెళ్లే ప్ర‌యాణికుల‌ను దృష్టిలో ఉంచుకుని టీజీఎస్ ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సులు న‌డ‌పాల‌ని నిర్ణ‌యించింది. న‌గ‌రం న‌లుమూల‌ల నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో పాటు తెలంగాణ ప‌లు జిల్లాల‌కు 1200 బ‌స్సులు న‌డ‌పాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఈ ప్ర‌త్యేక బ‌స్సులు జ‌న‌వ‌రి 9 నుంచి 15 వ‌ర‌కు ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉండ‌నున్నాయి.

ప్ర‌త్యేక బ‌స్సులు ఈ ప్రాంతాల‌కే..!

ఏపీలోని విశాఖ‌ప‌ట్నం, నెల్లూరు, ఒంగోలు, తిరుప‌తి, కాకినాడ‌, కందుకూరు, విజ‌య‌వాడ‌, రాజ‌మండ్రి, ఉద‌య‌గిరి, తెలంగాణ‌లోని న‌ల్ల‌గొండ‌, నిజామాబాద్, క‌రీంన‌గ‌ర్, వ‌రంగ‌ల్ జిల్లాల‌కు ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డ‌పనున్నారు. ఈ మార్గాల్లో ఎల‌క్ట్రిక్ బ‌స్సులు న‌డిపేందుకు ఆర్టీసీ అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

హైదరాబాద్​లోని బీహెచ్‌ఈఎల్‌ డిపో ఆర్సీపురం నుంచి మియాపూర్, కేపీహెచ్‌బీ, ఔటర్‌ రింగ్​ రోడ్డు మీదుగా అమలాపురం, కాకినాడ, నర్సాపురం, విశాఖపట్నం, రాజమండ్రి, పోలవరం, గుంటూరు, విజయవాడతో పాటు ఇతర ప్రాంతాలకు బస్సులు నడపనున్నట్టు బీహెచ్‌ఈఎల్‌ డిపో అధికారులు ప్రకటించారు.

ప్ర‌త్యేక రైళ్లు కూడా అందుబాటులో..

సంక్రాంతికి ఏపీకి వెళ్లే ప్ర‌యాణికుల‌ను దృష్టిలో ఉంచుకుని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే కూడా ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డ‌ప‌నుంది. ఇప్ప‌టికే ప‌లు ప్ర‌త్యేక రైళ్ల‌ను ప్ర‌క‌టించ‌గా, వాటిల్లో సీట్లు అన్ని నిండిపోయాయి. ఇక మిగిలిన ప్ర‌యాణికుల కోసం మ‌రో 11 ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డుపుతామ‌ని రైల్వే అధికారులు ప్ర‌క‌టించారు.

జనవరి 7 నుంచి 12 మ‌ధ్య ప్ర‌త్యేక రైళ్లు..

జనవరి 7 నుంచి 12వ తేదీల మధ్య కాకినాడ నుంచి వికారాబాద్‌, వికారాబాద్‌-పార్వతీపురం, కాకినాడ టౌన్‌-వికారాబాద్‌, పార్వతీపురం-వికారాబాద్‌, పార్వతీపురం-కాకినాడ టౌన్‌, సికింద్రాబాద్‌-పార్వతీపురం మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఆయా ట్రైన్లలో 1ఏసీ, 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్‌ కోచ్‌లతో పాటు సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు కూడా అందుబాటులో ఉంచినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఆయా రైళ్లకు సంబంధించి ముందస్తుగానే బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయని తెలిపింది.